బంగాళాఖాతంలో ఏర్పడిన 'యాస్ తుపాను'పై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో నిత్యావసరాల దగ్గరనుంచి.. అన్నిరకాల సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇబ్బంది లేకుండా చూడండి..
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేశామని సీఎంకు అధికారులు వివరించారు. తుపాను వల్ల కొవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముందుజాగ్రత్తగా వారిని తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే ఆ చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఆక్సిజన్ సిలెండర్లకు రీఫిల్లింగ్ చేసే ప్లాంట్లకూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా.. డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు.