ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర సొంత ఆదాయం పెరిగేందుకు తగిన ఆలోచనలు చేయాలి- సీఎం జగన్ - ముఖ్యమంత్రి జగన్

cm ys jagan: ఆదాయాన్ని ఆర్జించే శాఖలపై సీఎం జగన్‌ సమీక్షించారు. అదనపు ఆదాయం కోసం పలు రాష్ట్రాలు ఎలాంటి విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలని ఆదేశించారు. ఆదాయ మార్గాలను కార్యరూపంలోకి తేవడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

cm ys jagan
jagan review on Revenue Generated departments

By

Published : Feb 16, 2022, 5:07 PM IST

Updated : Feb 17, 2022, 4:51 AM IST

cm ys jagan: సొంత ఆదాయ వనరులు పెంచుకోవడానికి వివిధ రాష్ట్రాలు ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నాయో అధ్యయనం చేయాలని అధికారులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వాటిలో మెరుగైన విధానాల్ని గుర్తించి, తదనుగుణంగా రాష్ట్ర ఆదాయం పెంపొందించడానికి ప్రణాళికలు రూపొందించాలని, వాటి అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. ఆర్థిక, రెవెన్యూ, వాణిజ్యం, ఎక్సైజ్‌, అటవీ, పర్యావరణ, గనులు వంటి ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి బుధవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షించారు.

అదనపు ఆదాయ సముపార్జనకు అవసరమైన ప్రణాళికల అమలు పురోగతిని సమీక్షించేందుకు సంబంధిత శాఖల అధికారులు క్రమం తప్పకుండా సమావేశమవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. రాబడులు పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్‌ఓపీ) పాటించాలని సీఎం స్పష్టంచేశారు. రిజిస్ట్రేషన్ల సౌకర్యాన్ని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్‌ సేవల్ని సమీక్షించి, తగిన మార్పులు, చేర్పులు చేయాలని నిర్దేశించారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గతంలో వెలుగు చూసిన అవినీతి ఘటనలు, లోపాలు వంటివి గ్రామ, వార్డు సచివాలయాల్లో చోటు చేసుకోకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఆ మేరకు ఎస్‌ఓపీ అమలు చేయాలన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్ల వల్ల పేదలకు భారీగా లబ్ధి చేకూరుతోందని సీఎంకు అధికారులు వివరించారు. ఓటీఎస్‌ పథకం, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో పేదలకు ఇప్పటి వరకు రూ.400.55 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు. టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్ల వల్ల మరో రూ.1,230 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్‌, ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్‌) కె.నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Last Updated : Feb 17, 2022, 4:51 AM IST

ABOUT THE AUTHOR

...view details