కొవిడ్ 19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణ, పరీక్షల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులపై చర్చించారు. కేసులు ఎక్కువగా నమోదవుతోన్న జిల్లాలు సహా అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఐసీయూ బెడ్లను పెంచాలని ఆదేశించారు. అవసరమైతే కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న పట్టణాల్లోనే ఆస్పత్రులను గుర్తించి అక్కడే చికిత్స అందించాలని చెప్పారు.
కరోనా పరీక్షలపై ఆరా
రాష్ట్రంలో నిర్వహిస్తున్న కరోనా పరీక్షలపై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకూ 41 వేల 512 మందికి పరీక్షలు చేయగా.. నిన్న ఒక్కరోజే 5 వేల 757 పరీక్షలు చేసినట్లు అధికారులు చెప్పారు. ప్రతి పది లక్షల జనాభాకు 830 మందికి పరీక్షలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో రాష్ట్రం నిలిచిందని సీఎంకు అధికారులు తెలిపారు. ట్రూనాట్ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని అధికారులు వివరించారు. దీనివల్ల 2 గంటల్లోగా ఫలితం వస్తోందని, తగిన చర్యలు తీసుకునేందుకు వీలవుతోందని చెప్పారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న వారందరికీ పరీక్షలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఆ కారణంతోనే కొరియా కిట్లు
ర్యాపిడ్ టెస్టు కిట్ల పనితీరుపై సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో ఇప్పటికే 6 వేల వరకు శాంపిళ్లను పరిశీలించామని... ఆ కిట్లు మంచి పనితీరు కనబరుస్తున్నాయని అధికారులు తెలిపారు. చైనా కిట్లు విక్రయించేందుకు గతంలో కొందరు రాష్ట్రానికి వచ్చారని.. వాటి పని తీరు సంతృప్తికరంగా లేదని తెలిపారు. ఈ కారణంతోనే చైనా కిట్లను కాకుండా కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. టెలీ మెడిసిన్‌లో 300 మంది డాక్టర్లు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. కాల్ చేసిన వారికి ప్రిస్క్రిప్షన్లతో పాటు మందులు కూడా అందించాలని సీఎం ఆదేశించారు.