ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM JAGAN: 'రైతులకు అవాంతరం లేకుండా ఉచిత విద్యుత్​ సరఫరా చేయడమే లక్ష్యం' - వ్యవసాయంపై సీఎం జగన్​ సమీక్ష

cm jagan review on agriculture
cm jagan review on agriculture

By

Published : Sep 1, 2021, 4:28 PM IST

Updated : Sep 1, 2021, 7:36 PM IST

16:25 September 01

వ్యవసాయ రంగంపై సీఎం జగన్‌ సమీక్ష

రైతులకు అవాంతరాల్లేని ఉచిత కరెంటు ఇవ్వడమే లక్ష్యమని సీఎం జగన్​ అన్నారు.  దీనికోసం  10వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు అమర్చడం ద్వారా ఎంత కరెంటు వాడుతున్నారు.. ఎంత లోడ్‌ పడుతుందనే విషయం తెలుస్తుందన్నారు. మీటర్ల వల్ల రైతులకు ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు ఉండవన్నారు. విద్యుత్‌ బిల్లుల సొమ్ము రైతుల ఖాతాల్లో ప్రభుత్వమే వేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో వర్షపాతం, పంటలసాగు, ఇ–క్రాపింగ్, వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై సీఎం  వైఎస్ జగన్ చర్చించారు.  

2038 ఉద్యానవన అధికారుల పోస్టుల భర్తీ..

  ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్​.. అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో భారీ పరికరాలను, సామగ్రిని అందుబాటులో ఉంచడమే కాకుండా ప్రతి ఆర్బీకే పరిధిలో  రైతులకు అవసరమైన పనిముట్లను వ్యక్తిగతంగా అందించాలన్నారు.  వచ్చే రబీ సీజన్‌లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న 2038 ఉద్యానవన అధికారుల పోస్టులను అగ్రికల్చర్‌ అభ్యర్థులతోనే వీటిని భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. డిసెంబరులో వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

చిరుధాన్యాలు సాగు ప్రోత్సహించాలి..

 బోర్లకింద, వర్షాధార భూములలో చిరుధాన్యాలు సాగుచేసేలా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్​ ఆదేశించారు. చిరుధాన్యాల సాగు చేస్తున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా భరోసా కల్పించాలని, దీనివల్ల రైతులు మరింత ముందుకు వస్తారన్నారు. వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు జరుగుతున్న తీరుపైనా సీఎం సమీక్షించారు. రైతులతో ఏర్పడ్డ వ్యవసాయ సలహామండళ్లలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, సమస్యలు నేరుగా కలెక్టర్ల దృష్టికి వెళ్లాలని.. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రైతులు చెప్తున్న సమస్యలను తీర్చే బాధ్యత కచ్చితంగా అధికారులు తీసుకోవాలన్నారు.

గోడౌన్లు ఏర్పాటు చేయాలి..

  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందాలని  సీఎం స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాల పనితీరు, సామర్థ్యం ఆ మేరకు మెరుగుపడాలన్నారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా కూడా రైతుల సమస్యలు నేరుగా ఉన్నతస్థాయికి తెలిసే వ్యవస్థను కూడా సిద్ధం చేయాలన్నారు. అత్యాధునిక పరిజ్ఞానాన్ని దీనికి వినియోగించుకోవాలన్నారు. నేచురల్‌ ఫార్మింగ్‌పైనా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్బీకే కేంద్రాలకు అనుబంధ భవనాలను విస్తరించుకుంటూ చిన్నపాటి గోడౌన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. భవనాలను నిర్మించేంత వరకూ అద్దె ప్రాతిపదికన కొన్ని భవనాలు తీసుకోవాలన్నారు.

 వైఎస్సార్‌ పొలంబడి కార్యక్రమంపైనా సీఎం సమీక్షించిన సీఎం.. పొలంబడి కార్యక్రమాల షెడ్యూలును రైతు భరోసా కేంద్రాల్లో ఉంచాలన్నారు. అగ్రికల్చర్‌ కాలేజీలు, యూనివర్శిటీ విద్యార్థులు ఆర్బీకేల్లో విధిగా పనిచేసేలా చూడాలన్నారు. ఆర్గానిక్‌వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ వచ్చేలా చూడాలన్నారు. ఇలాంటి ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మోతాదుకు మించి అధికంగా ఎరువులు, పురుగు మందులు వాడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఆర్బీకే యూనిట్లుగా మ్యాపింగ్‌చేసి ఆక్కడ రైతులకు పొలంబడుల ద్వారా ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించాలన్నారు. ఇ–క్రాపింగ్‌ చేసిన రైతులకు భౌతిక రశీదులు, డిజిటల్‌ రశీదులు  ఇవ్వాలని ఆదేశించారు.

 హార్టికల్చర్‌లో విద్యార్హతలు ఉన్నవారు సరిపడా లేకపోవడంతో గ్రామ సచివాలయాల్లో ఉన్న 2038 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. అగ్రికల్చర్‌ అభ్యర్థులతోనే వీటిని భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి ప్రతినిధులతో రాష్ట్రస్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి: 

RRR: 'సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనడం దారుణం'

Last Updated : Sep 1, 2021, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details