ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan Review On Omicron Variant: ఎలాంటి పరిస్థితులైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సీఎం జగన్

CM Jagan Review On Omicron Variant: ఒమిక్రాన్‌ విషయంలో భయాందోళన అవసరంలేదని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ఉద్ధృతంగా కొనసాగించాలన్నారు. వైద్యారోగ్య శాఖపై సమీక్షించిన సీఎం.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. బూస్టర్‌డోస్‌ వేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కళాశాల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

CM YS Jagan
CM YS Jagan

By

Published : Dec 27, 2021, 4:07 PM IST

Updated : Dec 27, 2021, 7:37 PM IST

వైద్య ఆరోగ్య శాఖ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కొవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం పచ్చజెండా ఊపారు. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండాలని సీఎం నిర్దేశించారు. ఆ లోగా కొత్త రిక్రూట్‌మెంట్లను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఫీవర్ సర్వే తప్పనిసరిగా జరగాలి..
CM Jagan On Booster Dose: కొవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి తీరు సహా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో సీఎం సమగ్రంగా చర్చించారు. కొవిడ్‌ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవడానికైనా సిద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా.. ప్రైవేటు రంగాల్లోని ఆస్పత్రులూ సిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్‌ ఉద్ధృతంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్రమం తప్పకుండా ఇంటింటికీ ఫీవర్‌ సర్వే తప్పనిసరిగా చేపట్టాలన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ చేయాలన్నారు. వ్యాక్సినేషన్‌ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. సర్వే సమయంలోనే వారికి తప్పక టీకాలు వేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ప్రకటించిన దృష్ట్యా దీనికోసం అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో సహా దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వృద్ధులకు బూస్టర్‌డోస్‌ వేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. 15 నుంచి 18 ఏళ్లవారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి వాక్సిన్ అవసరమని ప్రాథమిక అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.

వ్యాక్సినేషన్ వివరాలపై ఆరా..
CM Jagan On Corona Vaccination: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 98.96 శాతం మొదటి డోస్‌ టీకాలు వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, పశ్చిమ గోదావరి , కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నూటికి నూరుశాతం మొదటి డోస్‌ ఇచ్చినట్లు తెలిపారు. కడపలో 98.93, విశాఖపట్నం 98.04, గుంటూరు 97.58, తూ.గో 97.43, కృష్ణా 97.12, శ్రీకాకుళంలో 96.70 శాతంమేర మొదటి డోస్‌ ఇచ్చినట్లు తెలిపారు. 71.76శాతం రెండో డోస్‌ వేసినట్లు అధికారులు వివరించారు.

ఒమిక్రాన్​పై భయాందోళన వద్దు..
CM Jagan Review On Omicron Variant: రాష్ట్రంలో 6 ఒమిక్రాన్‌ కేసులున్నాయని అధికారులు ముఖ్యమంత్రి కి తెలిపారు. వీరిలో ఎవ్వరూ ఆస్పత్రిపాలు కాలేదన్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం భయాందోళన అవసరంలేదన్న సీఎం.. అదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతరత్రా ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. డేటాను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్ధతిలో ముందుకు పోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలని నిర్దేశించారు. సచివాలయం స్థాయి నుంచి డేటాను తెప్పించుకుని అవసరమైన చర్యలు వేగంగా తీసుకోవాలన్నారు. ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలోనే పరీక్షలు చేయాలన్నారు. విదేశాలనుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహిస్తూ గుర్తించాలన్నారు. వారికి క్రమం తప్పకుండా పరీక్షలు జరపాలని సీఎం సూచించారు.

నాడు - నేడు పనులపై సమీక్ష..
CM Jagan Review On Nadu -Nedu: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు – నేడు పనుల ప్రగతిపై సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కళాశాల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇవి పూరైతే అత్యాధునిక వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. మెడికల్‌ సీట్లు పెరగడం సహా.. మంచి వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు. మెడికల్‌ హబ్స్‌ ఏర్పాటు ప్రగతిపైనా సమీక్షించిన సీఎం.. వీలైనంత త్వరగా ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రైవేటు రంగంలోనూ అత్యాధునిక వైద్య సదుపాయాలు రావాలన్నదే హబ్స్‌ ఏర్పాటు ఉద్దేశమని చెప్పారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే వారం కొవిడ్ పై మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించాలని సీఎం నిర్ణయించారు.

"ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులనూ సిద్ధం చేయాలి. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ఉద్ధృతంగా చేయాలి. ఒమిక్రాన్‌ విషయంలో భయాందోళన అవసరంలేదు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కేంద్రం బూస్టర్‌ డోస్‌ ప్రకటన దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవాలి" - ముఖ్యమంత్రి జగన్

విస్తరిస్తోన్న ఒమిక్రాన్..
Omicron Cases In Delhi: మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దిల్లీలో ఒమిక్రాన్ కేసులు మరో 63 నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజులో అత్యధికంగా 152 కేసులు నిర్ధరణ అయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 578కి చేరినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 151 మంది కోలుకున్నారు.

మొత్తంగా 19 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. ఇక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్రను దాటి దిల్లీ తొలి స్థానానికి చేరింది. దిల్లీలో 142 మందికి ఈ వేరియంట్ సోకగా.. మహారాష్ట్రలో ఆ సంఖ్య 141గా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం కేరళలో 57, గుజరాత్​లో 49, రాజస్థాన్​లో 43, తెలంగాణలో 41 కేసులు నమోదు అయ్యాయి.

Night Curfew In Delhi:దేశ రాజధాని దిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రాత్రి 11 నుంచి ఉదయం ఐదింటి వరకు జనసంచారంపై ఆంక్షలు విధించనున్నారు.

ఇదీ చదవండి:

Jagan bail cancellation petition: జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు

Last Updated : Dec 27, 2021, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details