ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రతి మహిళా లక్షాధికారి కావాలి : ముఖ్యమంత్రి జగన్ - cm jagan on women development

మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుందన్న సిద్ధాంతాన్ని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోందని.. అందుకే స్త్రీ సాధికారతకు కృషి చేస్తోందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గత 23 నెలలుగా ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగులో మహిళా సాధికారత లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.1,109 కోట్ల సున్నా వడ్డీ నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు.

cm jagan on ysr sunna vaddi scheme
cm jagan on ysr sunna vaddi scheme

By

Published : Apr 23, 2021, 12:08 PM IST

Updated : Apr 24, 2021, 5:06 AM IST

రాష్ట్రంలోని ప్రతి మహిళా లక్షాధికారి కావాలని, ప్రతి చిన్నారీ కనీసం గ్రాడ్యుయేట్‌ అవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. మహిళలు బాగుంటేనే కుటుంబాలు.. తద్వారా రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక స్వావలంబనతో మొదలయ్యే ఈ ప్రయాణం సామాజికంగా, రాజకీయంగా కూడా వారిని గొప్పగా నిలబెట్టే పరిస్థితి రావాలన్నారు. ఆ దిశగా మహిళా సాధికారత కోసం గత 23 నెలల్లో అడుగులు వేశామని సీఎం తెలిపారు. 21వ శతాబ్దపు ఆధునిక భారత మహిళ రాష్ట్రం నుంచే ఎదగగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ శుక్రవారం మీట నొక్కి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘2020-21 ఏడాదిలో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకొని సకాలంలో నెల వారీ వాయిదాలు చెల్లించిన వారికి వడ్డీ రాయితీ అందజేస్తున్నాం. ఇందుకోసం 9.34 లక్షల డ్వాక్రా సంఘాల్లోని 1.02 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం కలిగేలా సంఘాల రుణ ఖాతాల్లో రూ.1,109 కోట్లు జమ చేశాం. 2019 ఏప్రిల్‌ నాటికి 8.71 లక్షల సంఘాలు ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 9.34 లక్షలకు చేరింది. మేం అధికారం చేపట్టగానే.. బ్యాంకు అధికారులతో మాట్లాడి డ్వాక్రా సంఘాలపై వేస్తున్న వడ్డీ భారాన్ని 12.5% నుంచి 9.5%కి తగ్గించాం. దీంతో మహిళలపై రూ.590 కోట్ల భారం తగ్గింది. గత ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది. దీంతో సంఘాలు అప్పులపాలై వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక మూతపడే స్థితికి చేరాయి. రూ.3 వేల కోట్ల వడ్డీ రాయితీకి అర్హత కోల్పోయాయి’ అని చెప్పారు.

ఆర్థికంగా చేయూతనిచ్చేలా..
‘ఆర్థికంగా చేయూతనిచ్చేలా వివిధ పథకాల ద్వారా మహిళల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశాం. రిటైల్‌ రంగంలో సొంత వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు మహిళలకు శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 69 వేల దుకాణాలు ఏర్పాటు చేయించాం. పాల ఉత్పత్తిలో అమూల్‌తో ఒప్పందం చేసుకొని లీటరు పాలకు రూ.5-7 వరకు అధికంగా లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాల ద్వారా 1.25 కోట్ల మందికి మేలు జరుగుతుంది. ఇళ్ల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో మహిళల చేతుల్లో రూ.2-3 లక్షల కోట్ల సంపద ఉంచబోతున్నాం’ అని వెల్లడించారు.

షాక్‌ కొట్టేలా మద్యం ధరలు పెంచాం...
‘అధికారంలోకి రాగానే 43 వేల గొలుసు దుకాణాలు, 4,380 పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేశాం. మద్యం దుకాణాలు మూడో వంతు తగ్గించాం. షాక్‌ కొట్టేలా మద్యం ధరలు పెంచడం వల్ల అమ్మకాలు తగ్గాయి. 2018-19తో పోలిస్తే 2020-21లో లిక్కర్‌ అమ్మకాలు 51%, బీరు అమ్మకాలు 80% మేర తగ్గాయి. ఆ విధంగా మద్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నాం’ అని స్పష్టంచేశారు.

సీఎం జగన్‌ది విలక్షణ పాలన...
సీఎం జగన్‌ది విలక్షణ పాలన అని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకపోవడంతో మహిళలు బంగారాన్ని అమ్ముకోవాల్సి వచ్చిందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కరోనా విపత్తులో సున్నా వడ్డీతో భారం తగ్గించారని, నగదు జమతో ఆర్థికంగా ఆదుకున్నారని కృష్ణా జిల్లాకు చెందిన కృష్ణవేణి, అనంతపురం జిల్లాకు చెందిన సాయిలీల, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లేశ్వరి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

Last Updated : Apr 24, 2021, 5:06 AM IST

ABOUT THE AUTHOR

...view details