CM YS Jagan: అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను జమ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి నగదును విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 9 లక్షల 30 వేల 809 మంది లబ్ధిదారులకు రూ. 703 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ సున్నావడ్డీ, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, ఆసరా, ఇళ్లపట్టాలు, నేతన్ననేస్తం పథకాల్లో లబ్ధి పొందని వారికి లబ్ధి చేకూర్చారు.
cm jagan on pensions: గతంలో సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేదని , ఇప్పుడు సంక్షేమ పథకాలే పేదలను వెదుక్కుంటూ వారి ఇంటి వద్దకే వస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. ఇదో విప్లవాత్మక మార్పు అని వ్యాఖ్యానించారు. పథకాల అమలు చేసేటప్పుడు ఎక్కడా కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు ఇవేవీ పట్టించుకోవడం లేదన్నారు. అర్హత ఉంటే పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలోని ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ఎలా కత్తిరించాలో చూసేవని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. లబ్ధి జరగకపోయినా తిరిగి దరఖాస్తు తీసుకుని తనిఖీ చేసి లబ్ధి చేకూర్చుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69 లక్షల పింఛన్లు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ ను 2,250 చేయడం సహా నెలకు 1450 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. వచ్చే జనవరి 1 నుంచి పింఛన్ను రూ. 2,250 నుంచి 2,500 రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం వెల్లడించారు. సోషల్ ఆడిట్ ద్వారా అర్హుల జాబితా కూడా ప్రదర్శించి వీరందరికీ న్యాయం చేస్తున్నామన్నారు.
"అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి. అర్హత ఉండి మిగిలి పోయినవారికి నగదు జమ చేస్తున్నాం. అందరికీ న్యాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కొవిడ్ సమయంలో ప్రభుత్వ రాబడి తగ్గినా ఏదీ ఆపలేదు. పేదలకు అండదండలు అందించే విషయంలో ఏమాత్రం రాజీ లేదు. 2019-20 రబీకి సంబంధించి రూ.9 కోట్లు జమ చేస్తున్నాం. పొదుపు సంఘాలకు మరో రూ.53 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకంలో దాదాపు రూ.39 కోట్లు, జగనన్న విద్యా దీవెన పథకంలో రూ.19 కోట్లు జమ చేస్తున్నాం. వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో దాదాపు రూ.19 కోట్లు, వైఎస్సార్ మత్స్యకార భరోసాలో రూ.3 కోట్లు అదనంగా జమ చేస్తున్నాం" - ముఖ్యమంత్రి జగన్