ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డిసెంబరు 15లోపు పంట నష్టం అంచనా వేయండి: సీఎం జగన్

నివర్ తుపాను సృష్టించిన విలయంలో నష్టపోయిన వారికి వెంటనే ఆర్థికసాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మృతి చెందిన బాధితులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని సూచించారు. తుపాను ధాటికి కకావికలమైన చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. డిసెంబర్ 15 నాటి కల్లా పంటనష్టం పూర్తిగా అంచనా వేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం.. డిసెంబర్ 30 నాటికి రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేసేలా ప్రణాళికలు రచించాలని ఆదేశించారు.

CM YS JAGAN CONDUCTED AN AERIAL SURVEY
సీఎం జగన్ ఏరియల్ సర్వే

By

Published : Nov 29, 2020, 6:46 AM IST

సీఎం జగన్ ఏరియల్ సర్వే

నివర్‌ తుపాను బాధితులకు వెంటనే ఆర్థికసాయం అందజేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో మృతిచెందిన ఆరుగురు, కడప జిల్లాలో మరణించిన ఇద్దరి కుటుంబసభ్యులకు రూ.5 లక్షల వంతున పరిహారం అందించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులకు రూ.500 వంతున ఇవ్వాలన్నారు. అన్నిరకాల నష్ట నివేదికలను డిసెంబరు 15 లోపు అందజేయాలని ఆదేశించారు. తుపాను నష్టాన్ని పరిశీలించడానికి శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుచరితతో కలిసి విహంగ వీక్షణం ద్వారా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో పరిశీలించారు. అనంతరం విమానాశ్రయానికి చేరుకుని మంత్రులు, మూడు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరదల కారణంగా దెబ్బతిన్న పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.


80% రాయితీతో విత్తనాలు
పంట నష్టాన్ని అంచనా వేసే అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అన్నదాతలకు 80% రాయితీతో విత్తనాలు అందించాలని, డిసెంబరు 31 నుంచి నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దెబ్బతిన్న రహదారులు, చెరువుల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. కడపలో బుగ్గవంక ప్రాజెక్టు పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 21 మండలాల్లో 245 గ్రామాల పరిధిలో తీవ్ర నష్టం సంభవించినట్లు సీఎంకు కలెక్టరు భరత్‌ గుప్తా వివరించారు. కడప, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు కూడా నష్టం వివరాలను సీఎంకు అందజేశారు. అంతకుముందు 1.15 గంటల పాటు మూడు జిల్లాలలో విహంగ వీక్షణం.. ఆ తర్వాత గంటన్నర పాటు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నష్టం వివరాలతో కూడిన ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్‌ బాషా, మంత్రులు సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా, మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details