చిన్న, పెద్ద జలాశయాల పరిధిలో వర్షపాతం, వరద ప్రవాహాల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి పర్యవేక్షించేందుకు రియల్‌టైమ్ ఆటోమేషన్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. దీనికి జలవనరులశాఖ ఈఎన్‌సీ (ఇంజినీర్ ఇన్ ఛీఫ్) కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలిచ్చామన్నారు. భారీ వరదల నేపథ్యంలో గేట్లు ఉన్న చిన్న, పెద్ద జలాశయాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
వరద నష్టం, సహాయ చర్యలపై శాసనసభలో శుక్రవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన చేశారు. ‘నాలుగు జిల్లాల్లో 1,990 గ్రామాలపై వరద ప్రభావం ఉంటే, అందులో 211 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. 44 మంది మరణించగా 16 మంది గల్లంతయ్యారు. వీరికి రూ.5లక్షల చొప్పున పరిహారం ఇచ్చాం. 1,169 ఇళ్లు పూర్తిగా, 5,434 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 319 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటుచేసి 79,590 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. కలెక్టర్లకు నిధులిచ్చాం. 95,949 కుటుంబాలకు నిత్యావసరాలతో పాటు కుటుంబానికి రూ.2వేలు అందించాం.
చనిపోయిన 5,296 పశువులకు నష్టపరిహారం అందించాం. పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించాం’ అని చెప్పారు. ‘వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి డ్రామాలు చేయడం కాదు, పనులు సరిగా చేస్తున్నారా? ప్రజలకు మంచి జరుగుతోందా? అనేది చూస్తూ.. వాటిని సక్రమంగా చేయించడమే నాయకుడి పని’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘అక్కడికి వెళ్లి చంద్రబాబు రాజకీయాలు మాట్లాడారు. ఆయన వరద ప్రాంతాలకు పోయింది ఎందుకు, మాట్లాడే మాటలేంటి? ఆయన సంస్కారానికి నా నమస్కారాలు’ అని విమర్శించారు.
నవీన్‌పట్నాయక్ ఎప్పుడైనా వరద ప్రాంతాల్లో కనిపించారా?
‘ఒడిశాలో ఏటా వరదలు వస్తాయి. ఏ రోజైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ వరద ప్రాంతాల్లో కనిపించారా? సీఎం అక్కడకు వస్తున్నారంటే ఆయన చుట్టూనే అధికారులు, మీడియా తిరగడంతో సహాయ చర్యలపై పర్యవేక్షణ ఉండదు’ అని ముఖ్యమంత్రి వివరించారు. ‘వరద ప్రాంతాల్లో ఏం చేయాలో.. అవన్నీ చేస్తూ, రోజూ సమీక్షించాం. సీనియర్ అధికారుల్ని జిల్లాలకు పంపించాం. మంత్రులు, ఎమ్మెల్యేలను శాసనసభకు రావద్దని, అక్కడే ఉండి పర్యవేక్షించాలని ఆదేశించాం’ అని చెప్పారు.