సమస్యల పరిష్కారంలో నాణ్యత ముఖ్యం! ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి..
సమస్యల పరిష్కారంలో నాణ్యత అనేది చాలా ముఖ్యమన్న సీఎం..ఏదైనా వినతిని తిరస్కరించే ముందు దానిపై సరైన కసరత్తు చేయాలని ఆదేశించారు. తిరస్కరించబోయే వినతులు కలెక్టర్ పరిశీలనకు వచ్చాకే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. దీనికి సంబంధించి ఒక యంత్రాంగాన్ని కలెక్టర్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లు ఎక్కువగా ఉన్న నెల్లూరు, కర్నూలు కలెక్టర్లతో సీఎం మాట్లాడి.. సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
హామీలు నెరవేరుస్తాం
స్పందన కార్యక్రమంలో రద్దీ ఉంటే మెుదట చేతిరాతతో రశీదు ఇచ్చి తర్వాత వాటిని కంప్యూటర్లలో అప్‌లోడ్ చేయించాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎండార్స్‌మెంట్ ఇస్తున్న పద్ధతి మరింత మెరుగుపడాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఇల్లులేని ప్రతి ఒక్కరికీ ఉగాది నాటికి కచ్చితంగా ఇళ్లస్థలాలు ఇవ్వాలని...పలానా తేదీలోగా ఇంటి స్థలం ఇవ్వబోతున్నామని వినతిపత్రం ఇచ్చేవారికి చెప్పాలని సూచించారు. గ్రామ వాలంటీర్ల పాత్ర చురుగ్గా ఉండేలా చూసుకోవాలన్న సీఎం...వాలంటీర్లందరికీ త్వరగా స్మార్ట్ ఫోన్లు అందించాలని ఆదేశించారు. అక్టోబరు 15న రైతు భరోసా పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు పడవలు, బోట్లు ఉన్నా 10వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24వేలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని డిసెంబర్ 21న నెరవేర్చబోతున్నట్లు తెలిపారు.
క్రీడలకు ప్రాధాన్యం
ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున..జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలు కాఫీ టు గెదర్ కార్యక్రమం కింద ప్రతి మంగళవారం కలవాలని సూచించారు. సెప్టెంబరులో నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో...ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రైతు చేతికే పంట నష్ట పరిహారం: సీఎం జగన్