ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రూ.6400 కోట్లతో రోడ్లకు మరమ్మతులు'

రాష్ట్రంలో రహదారులకు మహర్దశ కలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దెబ్బతిన్న రహదారులకు సత్వరం మరమ్మతులు చేయటం సహా కొత్త రోడ్ల నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర, జాతీయ రహదార్ల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.

సీఎం జగన్

By

Published : Nov 4, 2019, 11:18 PM IST

రోడ్లు, భవనాల శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

రోడ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ పద్ధతి పాటించాలని సీఎం జగన్ ఆదేశించారు. సింగిల్‌ లైన్ రోడ్లు అనే విధానాన్ని విడిచిపెడితే మంచిదని సీఎం అన్నారు. రోడ్ల విస్తరణ ఏదైనా రెండు లైన్ల రోడ్లుగా విస్తరిస్తేనే బాగుంటుందని సూచించారు. రోడ్లు, భవనాల శాఖపై ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించాలని, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తికావాలని ఆదేశించారు. విజయవాడ కనకదుర్గ వారధిని సత్వరమే పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించగా... జనవరి నెలాఖరుకు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ డిసెంబర్‌ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే విషయంలో భూసేకరణపై ప్రధానంగా దృష్టిపెట్టి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఆరులైన్లకు సరిపడా టన్నెల్స్‌ ఉండేలా చూడాలన్నారు. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వేను చిలకలూరిపేట బైపాస్‌కు అనుసంధానం చేసే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ అంగీకారం తెలిపారు. న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు రుణ సహాయంతో రోడ్లకు మహర్దశ రానుందని జగన్ వ్యాఖ్యానించారు. రూ.6400 కోట్లతో సుమారు 3,100 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్ల అభివృద్ది, అవసరమైన చోట కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. బ్యాంకు రుణసహాయాన్ని 6 వేల 400 కోట్ల రూపాయల నుంచి 8 వేల 800 కోట్లకు పెంచేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు.

పాత బ్రిడ్జిలను జాబితాలో చేర్చండి

జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకున్న రోడ్లకు ప్రధాన ప్రాధాన్యం ఇవ్వాలని... అవసాన దశలో ఉన్న 676 బ్రిడ్జిలను ఎన్డీబీ ప్రాజెక్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు. ఆర్‌ అండ్‌ బీలో ఉన్న ఖాళీలను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. జనవరిలో భర్తీ కోసం క్యాలెండర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు.

రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వినియోగం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సీఎంకు వివరించారు. పట్టణాలు, నగరాల్లోని సేకరించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎన్‌హెచ్‌ఏఐకు ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. దీనికోసం ఒక విధానాన్ని రూపొందించాలన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల సరఫరాపై ఎంఓయూకు సిద్ధంగా ఉన్నామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సీఎంకు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details