ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆరోగ్య'మస్తు: వందకు పైగా సిఫారసులు... సీఎం అంగీకారం! - వందకు పైగా సిఫారసులు... సీఎం అంగీకారం

జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీని పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఆరోగ్య రంగంపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై సీఎం చర్చించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సీఎం జగన్

By

Published : Sep 18, 2019, 6:11 PM IST

Updated : Sep 18, 2019, 7:23 PM IST

ఆరోగ్య రంగంపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. వందకు పైగా సిఫారసులు చేసింది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం విధించాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ మేరకు జీతాలు పెంచాలని కమిటీ సూచించింది. ఈ సూచనకు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి అంగీకరించారు. సిఫారసులపై నిపుణులతో విస్తృతంగా చర్చించారు. సాధ్యాసాధ్యాల మేరకు తగిన ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.

సీఎం జగన్

కీలక నిర్ణయాలు...

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని 150 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని నిర్ణయించారు. ఆయా నగరాల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు నవంబరు 1 నుంచి ప్రారంభించనున్నారు. డిసెంబరు 21 నుంచి ఆరోగ్యకార్డులు జారీ చేయనున్నారు. ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా మరికొన్ని వ్యాధులు చేర్చేందుకు నిర్ణయించారు.

ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టు...

జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తెస్తూ పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో 1,200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తెస్తూ పైలట్‌ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు పథకాన్ని... వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలు చేయనున్నారు.

ప్రణాళిక రూపొందించండి...

లోటుపాట్లు గుర్తించి... పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ 1 నుంచి జిల్లాలవారీగా ఆరోగ్యశ్రీ అమలు చేయనున్నారు. శస్త్రచికిత్స చేయించుకున్నవారు కోలుకునే వరకు నెలకు రూ.5 వేల సాయం అందించాలని జగన్ నిర్ణయించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛను పెంపుపై సమావేశంలో చర్చించారు.

సిఫారసుల్లో ముఖ్యాంశాలు...
ఆస్పత్రుల్లో సరైన సమీక్ష, పర్యవేక్షణ ఉండడంలేదని... రోజువారీ పరిశీలన, పర్యవేక్షణ అవసరమని కమిటీ పేర్కొంది. ఒకరు చేసే పనిని... ఇంకొకరు చేస్తున్నారని... డూప్లికేషన్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఆస్పత్రుల్లో పరికరాలన్నీ పాతబడ్డాయని... ''ఇది నాది'' అనే భావన ఉండడం లేదని స్పష్టం చేసింది. వ్యాధి నిరోధకతపై దృష్టిపెట్టాలని... 30శాతం మంది హృద్రోగ, క్యాన్సర్‌ వంటి వ్యాధుల బాధపడుతున్నారని కమిటీ సీఎం జగన్​కు వివరించింది. మూడు దశల్లో ప్రాథమిక వైద్యం అందించాలని... 5వేల మందికి ఒక సబ్‌ సెంటర్‌ ఉండాలని ప్రతిపాదించారు.

ప్రతి 30వేల మందికి ఒక పీహెచ్​సీ, ప్రతివేయి మందికి విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేయాలని... చిన్నచిన్న చికిత్స అక్కడే అందించాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. రాష్ట్రంలో 18ఏళ్లలోపు ఉన్న వారు సుమారు కోటిమంది ఉన్నారని... వారి ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. యూత్‌ క్లబ్​ల తరహాలో కేంద్రాలు ఏర్పాటుచేసి ఆరోగ్యంపైన అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి పీహెచ్​సీలో సిబ్బందిని 9 నుంచి 13కు పెంచాలని ప్రతిపాదించారు. ముగ్గురు వైద్యులు, ఒక కౌన్సెలర్‌ లేదా సోషల్‌ వర్కర్‌ ఉండాలని తెలిపారు.

దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వైద్యం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యతను వీరికి అప్పగించాలన్నారు. ప్రతి పీహెచ్​సీ 24 గంటలు నడిచేలా చూసుకోవాలని సూచించారు. 2బెడ్‌ ఐసీయూ సదుపాయం ఉండాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో నర్సింగ్‌ విద్య పటిష్టంగా లేదని... నర్స్‌ ప్రాక్టీషినర్స్‌కు ప్రత్యేక కేడర్‌ ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలను, వసతులను పెంచాలని... జిల్లా ఆస్పత్రుల స్థాయిని 500 పడకలకు పెంచాలని ప్రతిపాదించారు. బోధనాసుపత్రుల్లో 2వేల బెడ్లవరకూ పెంచాలని సూచించారు.

30 మహిళా ఆరోగ్య కేంద్రాలను 500 బెడ్లతో ఏర్పాటు చేయాలని... ప్రసవాలు, మహిళల ఆరోగ్యం కోసం ఈ కేంద్రాలను వినియోగించాలన్నారు. డ్రగ్‌ రెగ్యులేటరీ కమిటీ ఉండటం సహా దాన్ని బలోపేతం చేయాలని సూచించారు. కనీసం 150 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాలని తెలిపారు. WHO ప్రమాణాలున్న మందులనే కొనుగోలు చేయాలని నివేదికలో పేర్కొన్నారు.

సీఎం ఆదేశాలు...
కొత్తగా వైద్యుల భర్తీకోసం నోటిఫికేషన్‌ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యావ్యవస్థల్లో సమూల మార్పులు రావాలని... ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ ఏదైనా... అనుభవం కచ్చితంగా ఉండేలా చూడాలన్నారు. ఈ మేరకు ఏ వృత్తివిద్యా కోర్సు తీసుకున్నా... చివరి ఏడాది వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఉండాలని ఆదేశించారు. పాఠ్యప్రణాళికలో అప్రెంటీస్ ఒక భాగం కావాలని సీఎం అన్నారు. విద్యావ్యవస్థలో ఈ లోపం ఉందన్న సీఎం... చదువుకున్నదాన్ని ఏవిధంగా అమలు చేయాలనే విషయాన్ని పాఠ్యప్రణాళికలో ఉంచాలన్నారు.

మెడికల్‌ కాలేజీల తరహాలో నర్సింగ్‌ కాలేజీలపైనా పర్యవేక్షణ ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. నర్సింగ్‌ విద్యను పటిష్టం చేయాలని... ప్రభుత్వ మెడికల్‌ విద్యాలయాల్లో తప్పనిసరిగా నర్సింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఆశావర్కర్లకు శిక్షణ ఇవ్వాలని... దీనికోసం పాఠ్యప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. 108, 104 తదితర సేవల్లో వాడుతున్న వాహనాల నిర్వహణకు సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. నాడు-నేడు కింద ఆస్పత్రుల్లో చేపట్టనున్న కార్యక్రమాలపైనా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు.

ఇదీ చదవండి

పార్టీలో చేరినా... తోట త్రిమూర్తులు నాకు శత్రువే!

Last Updated : Sep 18, 2019, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details