'30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయండి' - ఏపీ నెపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కమిటీ
రాష్ట్రంలో 30 కొత్త నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఐటీ పాలసీ, నైపుణ్యాభివృద్ధిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ది శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి గౌతంరెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధు, స్కిల్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనంతరాము, ఐటీ, పౌర సరఫరాల ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 30 నైపుణ్యాభివృద్ది శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని.., నాలుగు ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా నాలుగు కేంద్రాలు, పులివెందుల జేఎన్టీయూకు అనుబంధంగా మరొక కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి గొప్ప ఊతమిచ్చేలా ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. 45 రోజుల్లోగా భూముల గుర్తింపు, ఆర్థిక వనరుల సమీకరణ పూర్తి కావాలని ఆదేశించారు.