ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. వివరాలు వెల్లడించని రాష్ట్ర ప్రభుత్వం
10:29 October 06
ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం జగన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఉదయం 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. దిల్లీలోని ప్రధాని అధికార నివాసంలో ఈ భేటీ జరిగింది. సాధారణంగా ప్రధానిని కలిసన తర్వాత ఆ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలను అధికారికంగా వెల్లడిస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం పత్రికా ప్రకటనలు చేసేది. ఈసారి ఆ వివరాలను వెల్లడించలేదు. దీన్ని బట్టి ఈ సమావేశం రాజకీయ, న్యాయపరమైన అంశాలకు పరిమితమై ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. కొందరు వైకాపా నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. ప్రధానితో భేటీ అయ్యారని పేర్కొంటూ.. వారిద్దరితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్న ఫోటోను ప్రధాని కార్యాలయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఎంపీ మిథున్‌రెడ్డి కూడా వెళ్లినా ప్రధానితో సమావేశంలో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో...... పెండింగులో ఉన్న రెవెన్యూ గ్రాంటు 10వేల కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 3వేల 500 కోట్ల రూపాయలు విడుదల చేయాలని...రాష్ట్ర విభజన చట్టం కింద ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధాని మోదీని సీఎం కోరినట్లు....అధికార వర్గాలను ఉటంకిస్తూ.... పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, కడపలో ఉక్కు పరిశ్రమ వంటి అంశాలూ చర్చకు వచ్చాయని పేర్కొంది.