తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తోన్న తెలంగాణ దళితబంధు పథకం నేటి నుంచే ప్రారంభం కానుంది. పేద దళితులకు జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వంద శాతం రాయతీతో అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన సర్కార్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ పద్ధతిలో ప్రారంభిస్తున్నారు. అన్ని దళిత కుటుంబాలకు ఈపథకం ద్వారా సాయం అందించాలని నిర్ణయించారు. హుజురాబాద్లో జరగనున్న బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్.. దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఇప్పటికే నిధులు బదిలీ
అత్యంత పేదలైన 15 దళిత కుటుంబాలకు సీఎం చేతుల మీదుగా దళితబంధు పత్రాలు, చెక్ అందిస్తారు. నేటి నుంచి దళితబంధు పథకం ప్రారంభం కానుంది. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించి మిగతా లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం కింద సాయం అందిస్తారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కోసం ఇప్పటికే రూ.500 కోట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాకు బదలాయించారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన యాదాద్రి జిల్లా వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాల కోసం 7.6 కోట్లను కలెక్టర్ ఖాతాకు బదిలీ చేశారు.
దశల వారీగా అమలు
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వంద చొప్పున పేద దళిత కుటుంబాలను ఎంపిక చేసి పథకం కింద ఈ ఏడాది ఆర్థికసాయం అందిస్తారు. మిగతా వారికి దశల వారీగా అమలు చేస్తారు. వచ్చే ఏడాది బడ్జెట్లో దళితబంధు కోసం రూ.30 వేల కోట్లు వరకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అఖిలపక్షం, హుజురాబాద్ దళిత ప్రతినిధులతో ఇప్పటికే సమావేశమై దళితబంధు పథక తీరుతెన్నులు, అమలుపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో జీవనోపాధి, వ్యాపారం కోసం కొన్ని యూనిట్లను కూడా సిద్ధం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూనిట్ల జాబితాను సిద్ధం చేశారు. లబ్ధిదారులు వారికి నచ్చిన ఉపాధిమార్గాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మార్గానిర్ధేశం, పర్యవేక్షణ ఉంటుంది. కొంత మంది లబ్ధిదారులు కలిసి ఎక్కువ పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో దళితబంధు అమలు కానుంది.