ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Yadadri: వైకుంఠాన్ని తలపించేలా యాదాద్రి..! - ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన

తెలంగాణ యాదాద్రిలో శ్రీలక్ష్మీనృసింహుని క్షేత్రాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు సందర్శించనున్నారు. శివాలయం, రథశాల, విష్ణుపుష్కరిణి పనులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. కీలక నిర్ణయాలు, ఉద్ఘాటనపై సీఎం సమీక్ష చేపట్టడంతోపాటు.. ఆలయ విస్తరణ చివరి దశకు చేరిన దృష్ట్యా తుది మెరుగులు దిద్దే పనులపై దిశానిర్దేశం చేయనున్నారు.

yadadri
yadadri

By

Published : Jun 21, 2021, 7:44 AM IST

ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా, వైకుంఠాన్ని తలపించేలా పునర్నిర్మిస్తున్న తెలంగాణలోని యాదాద్రి క్షేత్రాన్ని సీఎం కేసీఆర్‌ సోమవారం మరోసారి సందర్శించనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా వరంగల్‌కు వెళ్లి తిరుగు ప్రయాణంలో యాదాద్రికి చేరుకొని పనులను పరిశీలిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

వివిధ పనులను కొలిక్కి తెస్తున్నారు. పెద్దగుట్టపై హెలిప్యాడ్‌ లైట్లు, ఆలయ మాడవీధిలో విద్యుత్తు దీపాలకు ఇత్తడి స్టాండ్ల బిగిస్తున్నారు. కొండపై అతిథిగృహాన్ని సిద్ధంచేశారు. ప్రధానాలయానికి సరికొత్త విద్యుద్దీపాలను అలంకరించారు. 80 నెలల క్రితం తన సంకల్పాన్ని చాటిన సీఎం... ఆలయ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, దిశానిర్దేశం చేస్తున్నారు.

కృష్ణశిలతో పునర్నిర్మాణం

హరిహరుల ఆలయాల పునర్నిర్మాణం పనులు పూర్తి కావొస్తున్నందున ఉద్ఘాటనపై ముఖ్యమంత్రి దృష్టిసారించారు. ఆ దిశలో 15వ సారి ఈ క్షేత్రాన్ని సందర్శించనున్న ఆయన ఆలయ నిర్మాణాలు, ఉద్ఘాటనపై కీలక నిర్ణయానికి రానున్నట్లు ‘యాడా’ భావిస్తోంది. క్షేత్రాభివృద్ధి కోసం ఇప్పటివరకు రూ.840 కోట్లు ఖర్చు కాగా, కొండపై పునర్నిర్మితమైన పంచనారసింహుల సన్నిధి, పర్వతవర్ధిని సహిత రామలింగేశ్వరస్వామి(శివాలయం) ఆలయాలకు రూ.240 కోట్ల ఖర్చయినట్లు యాడా వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు తెలిపారు.

పూర్తిస్థాయిలో కృష్ణశిలతో ప్రధాన ఆలయ పునర్నిర్మించారు. అష్టభుజ మండప ప్రాకారాలు, రాజగోపురాలు, దివ్య విమానం, ఆళ్వారుల మండపం అద్భుతంగా నిర్మించారు. గర్భగుడి మహాద్వారంపై ప్రహ్లాద చరిత్ర, భక్తాగ్రేసరుల విగ్రహ రూపాలు ఈ క్షేత్ర విశిష్టతను నలుదిశలా చాటనున్నాయి.

ఇదీ చదవండి:

కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం సరికొత్త రికార్డు

ABOUT THE AUTHOR

...view details