ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ యాదాద్రికి వెళ్లనున్నారు. గతేడాది సెప్టెంబరు 13న క్షేత్రానికి వచ్చిన ఆయన.. ఐదున్నర నెలల తర్వాత మరోసారి పర్యటించబోతున్నారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనను.. ఘనంగా నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి.. అసంపూర్తిగా మిగిలిన పనులను పూర్తి చేయించేందుకు మరోమారు యాదాద్రిలో అడుగు పెట్టబోతున్నారు. 1200 కోట్ల రూపాయలతో ప్రారంభించిన పునర్నిర్మాణాలను 2016 అక్టోబరు 11న ప్రారంభించగా.. ఇప్పటివరకు సుమారు 850 కోట్లు వెచ్చించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అద్భుత గోపురాలు, ప్రభవించే ప్రాకారాలు, దశావతారాలు, ఆళ్వారులతో అలరారుతున్న ప్రధాన ఆలయం.. 4.33 ఎకరాల్లో రూపుదిద్దుకుంటోంది.
తుది దశకు పునరుద్ధరణ పనులు
మాడ వీధుల్లోని సాలహారాల్లో విగ్రహాల పొందిక పనులు మినహా... ప్రధానాలయ పునర్నిర్మాణం పూర్తయింది. పంచ లోహంతో ప్రహ్లాద చరిత్రను చాటే పలకలను గర్భాలయ మహా ద్వారంపై... జయ విజయుల శిల్పాల మందిరాలకు ఇత్తడి ప్రభలను బిగించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి... గండ భేరుండ నార సింహస్వామిని దర్శించుకునే ఏర్పాట్లున్నాయి. ప్రధానాలయానికి అనుబంధంగా నిర్మిస్తున్న శ్రీ పర్వత వర్ధిని రామ లింగేశ్వరుడి ఆలయ పునరుద్ధరణ పనులు... తుది దశకు చేరుకున్నాయి. రామానుజ కూటమిగా పిలుచుకునే వంటశాల... యాగశాల, నిత్య కల్యాణ మండపంతోపాటు అద్దాల మండపాన్ని రూపొందించారు. ఆలయ పడమర దిశలో వేంచేపు మండపం, తూర్పున బ్రహ్మోత్సవ మండపం, ఉత్తరాన రథశాల నిర్మించారు.