ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటినీ వదులుకునే ప్రసక్తి లేదు' - kcr about apex council meeting

కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటినీ వదులుకునే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కాపాడుకుంటామని చెప్పారు. దీని కోసం ఎంతటి పోరాటానికైనా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని అన్నారు.

cm-kcr
cm-kcr

By

Published : Jul 30, 2020, 11:12 PM IST

Updated : Jul 31, 2020, 2:07 AM IST

ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో అనేక కష్ట నష్టాలకు తెలంగాణ గురైందని.. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో మన హక్కును, నీటి వాటాను కాపాడుకుని తీరాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఎంతటి పోరాటానికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని సమావేశంలో ఉమ్మడి అభిప్రాయం వ్యక్తమైంది. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 5న ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పాల్సిందిగా ఆ శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ రాసిన లేఖపై గురువారం ప్రగతిభవన్‌లో నీటిపారుదలశాఖ నిపుణులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

నీటి వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహణకు ఆగస్టు 5వ తేదీని కేంద్రం నిర్ణయించిందని, ఆ రోజున ముందే నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాలుండటం వల్ల అసౌకర్యంగా ఉంటుందన్న భావన సమావేశంలో వ్యక్తమైంది. దీంతోపాటు స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాక ఆగస్టు 20 తదనంతరం సమావేశం ఉండేలా వేరే తేదీని నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జల వనరులశాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయాలని ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం సూచించింది.

ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉందని సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది.

'కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూసే సంప్రదాయం ఉంది. అయితే ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలని, వివాదాలున్నపుడు పరిష్కార బాధ్యతను ట్రైబ్యునల్‌కు అప్పగించాలి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు ముందునుంచీ ఉన్న నేపథ్యంలో పునర్విభజన చట్టం సెక్షన్ -13ను అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రైబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కోరుతూ వచ్చింది. కానీ, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పెడచెవిన పెట్టింది' అని సమావేశం తీవ్రంగా ఖండించింది. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది.

తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులు, ట్రైబ్యునల్‌ వివాదాలు న్యాయబద్ధంగా పరిష్కారం కావాలని, నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసి తీరాలని, అవాంతరాల్ని లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించించింది. గోదావరి, కృష్ణా జలాల్లో మన రాష్ట్రం వాటాను ఎట్టి పరిస్థితుల్లో సమగ్రంగా, సమర్థంగా వినియోగించుకోవాలని, ఇందుకోసం రాజీలేని వైఖరిని అనుసరించాలని, ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగాలని సమావేశం బలంగా అభిప్రాయపడింది.

Last Updated : Jul 31, 2020, 2:07 AM IST

ABOUT THE AUTHOR

...view details