ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్-1 పరీక్షలకు శిక్షణనిచ్చేందుకు తెలంగాణలో నాలుగు రాష్ట్రస్థాయి స్టడీ సర్కిళ్ల (ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్)ను అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం నుంచి ఏటా 50కి తగ్గకుండా అఖిలభారత సర్వీసు అధికారులను తయారు చేయాలన్నారు. ఇవి కాక ప్రతి జిల్లాలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీలకు ఒక్కొక్కటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 33 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల విద్యాలయాలు, జిల్లాకో మహిళా డిగ్రీ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలను స్థాపించాలని ఆదేశించారు. అన్ని గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్మీడియెట్‌ను ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు విస్తృతంగా వినియోగించుకోవాలని, పెద్దఎత్తున ప్రచారం కల్పించాలని సీఎం చెప్పారు.
‘రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం శిక్షణ కేంద్రాలుగానే కాకుండా, ఉద్యోగం, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలి. దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. ఇందుకు సమర్థులైన అధికారులను నియమించాలి. అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు, కంప్యూటర్ల వంటి సాంకేతిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.