తెలంగాణ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పనుల పురోగతిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు అధికారులు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో మహబూబ్‌నగర్ నీటిగోసను, నల్గొండ ఫ్లోరైడ్ కష్టాలను ప్రస్తావించకుండా తన ప్రసంగం సాగేది కాదన్న సీఎం... నాటి పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను కావాలనే పెండింగులో పెట్టారని అన్నారు.
ఒక్కొక్కటిగా...
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆన్‌గోయింగ్ పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నామన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు కొందరు దుర్మార్గంగా కోర్టుల్లో కేసులు వేసి స్టేల ద్వారా అడ్డుపడుతున్నారని ఆక్షేపించిన కేసీఆర్... అయినప్పటికీ పట్టుదలతో పనులు చేసుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. జూరాల సహా ఇప్పటికే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి దక్షిణ పాలమూరుకు చెందిన 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు సీఎం చెప్పారు.
డిసెంబర్ కల్లా...
వాటిలో మిగిలిన పనులను త్వరగా పూర్తిచేసే విషయమై ఆలోచించాలని సీఎం కోరారు. కాళేశ్వరం స్పూర్తితో పనులు సాగాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి.. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తికావాలన్నారు. గోదావరి, కృష్టా నదుల ప్రవాహాలకు తేడా ఉంటుందని సముద్రం వైపు ప్రవహించే కొద్దీ గోదావరి ప్రవాహం పెరుగుతూ పోతుంటే, కృష్టా ప్రవాహం తగ్గుతూ వస్తుంటుందని కేసీఆర్ విశ్లేషించారు.