ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చ - telangana varthalu

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖపై అధికారులతో సమావేశమయ్యారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రంతో వివాదం నడుస్తున్న తరుణంలో ఈ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది.

Telangana cm kcr
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

By

Published : Jul 6, 2021, 8:50 PM IST

నీటి పారుదల శాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్​లో సీఎస్​ సోమేశ్​కుమార్​, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల పురోగతితో పాటు ఆంధ్రప్రదేశ్‌ సర్కారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల అంశంపై సమావేశంలో చర్చిస్తున్నారు. కృష్ణా జలాల విషయంలో ఏపీతో వివాదం నడుస్తున్న తరుణంలో సీఎం సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిణామాలు, కృష్ణా బోర్డు సమావేశం, ప్రభుత్వ పరంగా తదుపరి కార్యాచరణ, తదితర అంశాలపై సీఎం చర్చిస్తున్నారు.

కృష్ణా జలాలపై కేంద్రానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం లేఖల ద్వారా ఫిర్యాదు చేసుకుంటున్నాయి. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు సందర్శించిన తర్వాతే కేఆర్​ఎంబీ సభ్యులు తమ ప్రాజెక్టుల్ని పరిశీలించాలని ఏపీ సీఎం జగన్‌... కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్‌... ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జూరాల నుంచి పులిచింతల వరకు విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఈ విషయంపైనా ఏపీ అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది. వచ్చే వానాకాలం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

తెలుగు రాష్ట్రాల మధ్య ఒక వైపు కృష్ణా జలాల వివాదం నడుస్తుంటే మరోవైపు తెలంగాణ విద్యుదుత్పత్తిని మరింత పెంచింది. సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద విద్యుదుత్పత్తిని ఒక్కసారిగా రాష్ట్ర జెన్​ కో అధికారులు పెంచారు. ప్రాజెక్టులోని మూడు యూనిట్లలో తెలంగాణ జెన్‌కో కరెంట్‌ ఉత్పత్తి చేస్తోంది. ఈ విషయంపైనా ఏపీ అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను రాష్ట్రం తోసిపుచ్చుతోంది.

ఇదీ చదవండి:

విశాఖ: అనకాపల్లి వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details