CM KCR Meeting: తెలంగాణలో మాదక ద్రవ్యాల పూర్తి నియంత్రణే ధ్యేయంగా ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి పోలీసు, ఆబ్కారీ సదస్సు జరగనుంది. హోం, ఆబ్కారీ శాఖల మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
ఎంతటివారైనా..
డ్రగ్స్ అనే మాటే రాష్ట్రంలో వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగించినట్లు తేలితే ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కఠిన చర్యల అమలు కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలని... రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందితో కూడిన ప్రత్యేక నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్‌డ్ క్రైమ్ కంట్రోల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠినచర్యలు తీసుకునేందుకు ఈ విభాగం.... డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక విధులను నిర్వర్తించనుంది. ప్రత్యేక విభాగం ఏర్పాటు, విధివిధానాలు, పనితీరు సహా ఇతర అంశాలపై ఇవాళ్టి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.