CM KCR: కొత్త జాతీయ పార్టీ భారత్ రాజ్య/రాష్ట్రీయ సమితి(భారాస) ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ దీనికి సంబంధించిన జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి సారించారని తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతో పాటు రాష్ట్రాల ప్రతినిధులను ముందుగా నియమించాలనే అంశంపై ఆయన పార్టీ ముఖ్యనేతలతో ఆదివారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ హాజరైనట్లు తెలుస్తోంది. ఈ నెల మూడో వారంలో కొత్త పార్టీ ప్రకటనపై ఇప్పటికే సీఎం కసరత్తు చేపట్టారు. దీనిపై తెరాస రాష్ట్ర కార్యవర్గంలో ఈ నెల 19న ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జాతీయ పార్టీ ఆవిర్భావం అనంతరం దిల్లీలో పార్టీ తరఫున ముగ్గురు లేదా నలుగురు అధికార ప్రతినిధులను నియమించాలని సీఎం భావిస్తున్నారు. తెరాసకు చెందిన ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు కేంద్ర సర్వీసు అధికారులు, కొంతమంది నేతల పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. కేసీఆర్ కొత్త పార్టీకి సంబంధించిన సమాచారం తెలుసుకొని పలు రాష్ట్రాల నుంచి నేతలు ఆయనను ఫోన్‌లో సంప్రదించినట్లు తెలిసింది. వారి జాబితానూ రూపొందించి, వారి గురించి పీకే ద్వారా కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
మమత భేటీకి వెళ్లాలా? వద్దా?