Cm Kcr Mumbai Tour: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా సర్కార్ రాజకీయాలు, విధానాలపై పోరాటం... దేశ రాజకీయాల్లో మార్పే ఎజెండాలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆదివారం ముంబయి వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ దేశ ఆర్థిక రాజధానికి పయనం కానున్నారు. ఇటీవల కేసీఆర్కు ఫోన్ చేసిన మహారాష్ట్ర సీఎం... భాజపా అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ఠాక్రే నివాసంలో భేటీ...
దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకునేందుకు సరైన సమయంలో గళం విప్పారన్న ఉద్ధవ్ ఠాక్రే... దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగించాలని.. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ముంబయికి వచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరించాలని... భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని ఉద్ధవ్ ఠాక్రే కోరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు కేసీఆర్ రేపు ముంబయి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం ముంబయి చేరుకుంటారు. బాంద్రా కార్లాలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లి అక్కడ ఆయనతో సమావేశమవుతారు.