ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS CM KCR ON YASANGI: 'యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు' - యాసంగి సీజన్​

ts cm kcr on yasangi: యాసంగిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సన్నద్దతపై సమీక్షించిన కేబినెట్.. మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఆందోళనల్లో మరణించిన ఉత్తరాది రైతుల కుటుంబాలకు మూడు లక్షల చొప్పున పరిహారానికి ఆమోదం తెలిపింది.

TS CM KCR
TS CM KCR

By

Published : Nov 30, 2021, 9:26 AM IST

'యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు'

ts cm kcr on yasangi: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​(cm kcr) అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం(cabinet meeting) ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై సుదీర్ఘంగా చర్చించింది. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షించారు. బాయిల్డ్ రైస్ తీసుకోబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. దిల్లీలో కేంద్ర మంత్రులు, అధికారులతో జరిపిన చర్చల సారాంశాన్ని మంత్రులు, అధికారులు వివరించారు. యాసంగిలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారు. రాష్ట్రం ఆవిర్భావానికి ముందు పదేళ్లు, తర్వాత ఏడేళ్ల పాటు వరిసాగు విస్తీర్ణం, సేకరించిన ధాన్యం వివరాలను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు. ధాన్యం కొనుగోళ్లతో గడచిన ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి పది వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు అధికారులు వివరించారు. పారాబాయిల్డ్ బియ్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రం, భారత ఆహార సంస్థ(FCI) చెబుతున్న నేపథ్యంలో తెలంగాణలో యాసంగిలో సాగయ్యే వరిధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదని కేబినెట్ అభిప్రాయపడింది. కేంద్రం బాయిల్డ్ రైస్(boiled rice) కొనబోమన్న నిర్ణయంతో.. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని ప్రకటించింది.

యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలుండవు..

కేంద్రం కొంటామంటే వరి పండించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ బాయిల్డ్‌ రైస్‌ కొనేది లేదని కేంద్రం స్పష్టంగా చెప్పంది. ఎంత పోరాడినా కేంద్రం ఒప్పుకోవడం లేదు. వానాకాలంలో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకే కేంద్రం ఒప్పుకుంది. యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. సొంతంగా విక్రయించుకునే రైతులు యాసంగిలో వరి వేసుకోవచ్చు. ధాన్యం పండించి రైతులు నష్టపోవద్దని మేం ధైర్యంగా చెబుతున్నాం. దీంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అందిస్తాం. -కేసీఆర్​, రాష్ట్ర ముఖ్యమంత్రి

వానాకాలంలోనూ కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం చెబుతోందని, పెంచడానికి అంగీకరించడం లేదని సీఎం చెప్పారు. మొత్తం ధాన్యం కొనుగోలు చేయకపోతే ప్రధాని కార్యాలయం, భాజపా కార్యాలయం ముందు పోస్తామని అన్నారు. వ్యవసాయరంగానికి, రైతులకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సింది అంతా చేస్తామన్న సీఎం... కేంద్రానికి ఏ శిక్ష విధిస్తారో ఆలోచించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే చర్యలపై ఉపసంఘం ఏర్పాటు..

వ్యవసాయ చట్టాల ఆందోళనల్లో మరణించిన 750 మంది రైతు కుటుంబాలకు మూడు లక్షల చొప్పున పరిహారానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా కొత్త వేరియన్ ఒమిక్రాన్ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ సన్నద్దతను సమీక్షించిన మంత్రివర్గం... ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. అందరూ టీకాలు తీసుకునేలా చూడాలని, వ్యాక్సినేషన్ పై మంత్రులు ఆయా జిల్లాల్లో పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించింది. టీకా తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉన్న ఆదిలాబాద్, కుమురంభీం అసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శిని మంత్రివర్గం ఆదేశించింది. కొత్త వేరియంట్ సన్నద్దత, నియంత్రణా చర్యలు, వ్యాక్సినేషన్​పై వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు నేతృత్వంలో కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబిత ఇంద్రారెడ్డి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి..

రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు వైద్యారోగ్య శాఖ సమీక్షించాలి. మందులు, టీకాలు, మౌలిక వసతులు సమకూర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి. మంత్రులంతా జిల్లాల్లో పర్యటించి తాజా పరిస్థితులపై సమీక్షించాలి. అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలి. ఆరు జిల్లాలపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆదిలాబాద్‌, కుమురం భీం, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాలపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొవిడ్‌ పరీక్షలు ఎక్కువగా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలి. -కేసీఆర్​, రాష్ట్ర ముఖ్యమంత్రి

ఇదీ చదవండి:

JAGANANNA VIDYA DEEVENA: జగనన్న విద్యా దీవెన మూడో విడత నేడే..!

ABOUT THE AUTHOR

...view details