Cm kcr yadadri tour speech: భువనగిరి జిల్లా అవుతుందని కలలో కూడా మనం అనుకోలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా రాయగిరిలో ఏర్పాటు చేసిన తెరాస బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్.. పరిపాలన సంస్కరణలో భాగంగానే భువనగిరి జిల్లా ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. నాడు భువనగిరి ప్రజలు ఉద్యమంలో తన వెంట నడిచారని వెల్లడించారు. కొద్దిరోజుల్లోనే ఈ ప్రాంతానికి కాళేశ్వరం జలాలు వస్తాయన్నారు. మిషన్ భగీరథతో మంచినీళ్ల బాధలు తొలగిపోయాయని తెలిపారు. భగీరథ ద్వారా తాగునీరు ప్రతి గడపకు అందుతున్నాయని అభిప్రాయపడ్డారు. భువనగిరి ప్రజలు బెబ్బులిలా తెలంగాణ కోసం పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. సాగుకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. రైతుబంధు, రైతు బీమా అమలు ఎలా జరుగుతుందో ప్రజలకు తెలుసన్నారు. అనేక రంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ట్రం ముందుకు సాగుతోందని ప్రకటించారు. తలసరి ఆదాయంలోనూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నామని చెప్పారు.
కేసీఆర్ భయపడతాడా?
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదిరి పిచ్చి పిచ్చి చట్టాలు తెస్తున్నారు. నల్లచట్టాలు తెచ్చి ఏడాది పాటు రైతులను ఏడిపించారు. దిల్లీలో సరిహద్దుల్లో రైతులపై లాఠీఛార్జి చేశారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే రైతులకు భయపడి నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని ప్రకటించి దేశానికి క్షమాపణలు చెప్పారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులిస్తాం.. లేకపోతే ఇవ్వమని చెబుతున్నారు. విద్యుత్ మోటార్ల వద్ద మీటర్లు పెడదామా? నేను చనిపోయినా సరే.. విద్యుత్ సంస్కరణలు ఒప్పకోను. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలి. 8 ఏళ్ల భాజపా పాలన దేశాన్ని సర్వనాశనం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మనవరకూ రావాలి కదా. ఏ రంగానికి మంచి చేశారు... ఎవరికి లాభం జరిగింది. ఇది మాట్లాడితే.. కేసీఆర్ నీ సంగతి చూస్తామంటున్నారు. ఏం చూస్తారు నా.. సంగతి. కేసీఆర్ భయపడతాడా? భయపడితే తెలంగాణ వచ్చేదా? విద్యార్థులు, మేధావులు ఆలోచన చేయాలి. - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్