'ఇక్కడ సర్కారు కూలిస్తే.. అక్కడ వారిని గద్దె దింపుతాం' KCR: మోదీ సర్కారు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతోందని తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తన మాట వినని ప్రభుత్వాలను కూలదోస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర మాదిరిగా తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని కూలదోస్తామని ఓ కేంద్రమంత్రి అంటున్నారని.. వారు ఇక్కడ సర్కారు కూలిస్తే తాము దిల్లీలో వారిని గద్దె దింపుతామని కేసీఆర్ హెచ్చరించారు.
తెలంగాణ కోసం ప్రజలు 60 ఏళ్లు పోరాటం చేశారని.. మరో పోరాటానికి వెనకాడరని కేసీఆర్ స్పష్టం చేశారు. నవ భారత నిర్మాణం కోసం మరోసారి ఉద్యమిస్తామన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా హైదరాబాద్ జలవిహార్లో తెరాస నిర్వహించిన సభలో ప్రధాని మోదీ లక్ష్యంగా కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని.. విద్వేషాలను రెచ్చగొడుతూ దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతోంది. తమ మాట వినని ప్రభుత్వాలను పడగొడుతోంది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టామని ఓ కేంద్రమంత్రి అన్నారు. తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొడతారా.. అదీ చూద్దాం. మిమ్మల్ని దిల్లీ నుంచే గద్దె దింపుతాం. తెలంగాణ కోసం ప్రజలు 60 ఏళ్లుగా పోరాటం చేశారు. మరోసారి పోరాటం చేయాల్సి వస్తే తెలంగాణ వెనుకడుగు వేయదు. నవ భారత నిర్మాణం కోసం మరోసారి ఉద్యమిస్తాం.-కేసీఆర్, తెలంగాణ సీఎం
ఈ సందర్భంగా మోదీ పాలనలో నిరుద్యోగం బాగా పెరిగిందని కేసీఆర్ ఆరోపించారు. ప్రతిరోజూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో సఫలమయ్యారని దుయ్యబట్టారు. కరోనా సమయంలోనూ ఏం చెప్పకుండా లాక్‌డౌన్ ప్రకటించారన్న కేసీఆర్.. ముందస్తు చర్యలు చేపట్టకుండా లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆ సమయంలో ప్రజలంతా తీవ్రంగా ఇబ్బందిపడ్డారని.. లక్షల మంది ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు నడుచుకుంటూ వెళ్లారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల ప్రజలను కన్నబిడ్డల మాదిరిగా చూసుకున్నామన్న కేసీఆర్.. ప్రతి ఒక్కరి జేబులో రూ.వెయ్యి పెట్టి.. 175 రైళ్లలో స్వగ్రామాలకు ఉచితంగా పంపామన్నారు.
ఇవీ చూడండి..