ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 27, 2020, 7:57 PM IST

Updated : Dec 27, 2020, 8:13 PM IST

ETV Bharat / city

వచ్చే ఏడాది గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సాధ్యం కాదు: కేసీఆర్

సోమవారం నుంచి తెలంగాణలోని రైతు బంధు సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదని స్పష్టం చేశారు.

cm-kcr
cm-kcr

తెలంగాణలోని రైతులందరికి రేపటి నుంచి రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్​లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కొనుగోళ్ల అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసిందన్నారు. వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదని స్పష్టం చేశారు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సీఎం పేర్కొన్నారు.

ఎకరానికి రూ.5 వేలు

రాష్ట్రంలో 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్లు పంట సాయంగా అందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు–కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. సీఎంఓ, వ్యవసాయ, మార్కెటింగ్ తదితర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

రూ.7,500 కోట్ల వరకు నష్టం

రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల పంటల కొనుగోళ్ల వల్ల చాలా నష్టం జరిగినట్లు అధికారులు సీఎం కేసీఆర్​కు వివరించారు. వరి ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనిగలు, పొద్దు తిరుగుడు పువ్వు, మినుములు తదితర పంటల కొనుగోళ్ల వల్ల.. ఇప్పటివరకు దాదాపు రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చిందని అధికారులు చెప్పారు. రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసినప్పటికీ ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మాల్సి వస్తున్నదన్నారు. దీనివల్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు.

కొనుగోళ్ల వల్లనే

ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి తలెత్తుతున్నదనీ వారు అభిప్రాయ పడ్డారు. కేవలం ధాన్యం కొనుగోళ్ల వల్లనే రూ.3,935 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు వివరించారు. మక్కల కొనుగోళ్ల వల్ల రూ.1547.59 కోట్లు, జొన్నల వల్ల రూ.52.78 కోట్లు, కందుల వల్ల రూ.413.48 కోట్లు, ఎర్ర జొన్నల వల్ల రూ.52.47 కోట్లు, మినుముల వల్ల రూ.9.23 కోట్లు, శనిగల వల్ల రూ.108.07 కోట్లు, పొద్దుతిరుగుడు కొనుగోళ్ల వల్ల రూ.14.25 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇలా నికరంగా వచ్చిన నష్టంతోపాటు హమాలీ, ఇతర నిర్వహణా ఖర్చులన్నీ కలుపుకుంటే రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు వివరించారు.

గ్రామాల్లో కొనుగోలు సాధ్యంకాదు

ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. ప్రతిసారి అలాగే చేయడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని.. రైస్ మిల్లరో, దాల్ మిల్లరో కాదన్నారు. కొనుగోళ్లు–అమ్మకాలు ప్రభుత్వం బాధ్యత కాదని స్పష్టం చేశారు. కాబట్టి వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదన్నారు.

ఎక్కడైనా అమ్ముకోవచ్చు

దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే, వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా, పద్ధతి ప్రకారం నిర్వహించాలన్నారు. రైతులంతా ఒకేసారి తమ పంటను మార్కెట్ కు తీసుకురాకుండా వంతుల ప్రకారం తీసుకురావాలని సూచించారు. రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, వ్యవసాయ విస్తరణాధికారులు సమన్వయంతో వ్యవహరించి.. ఏ గ్రామానికి చెందిన రైతులు ఎప్పుడు మార్కెట్​కు సరుకులు తీసుకురావాలో నిర్ణయించాలన్నారు. దాని ప్రకారం రైతులకు టోకెన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. చెప్పిన రోజు మాత్రమే సరుకును మార్కెట్​కు తీసుకరావడం వల్ల రైతులకు సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలని సమావేశంలో పాల్గొన్న వారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏడాది కిస్తీ

రైతు బీమా కార్యక్రమం ప్రారంభించిన నాడు కేవలం రూ.630 కోట్ల కిస్తీ మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. కానీ.. చాలామంది రైతులు తమ కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తింపజేయాలనే ఉద్దేశంతో తమకున్న భూమిని కుటుంబ సభ్యుల పేర రిజిస్టర్ చేయించారు. దీంతో రైతుల సంఖ్య పెరిగింది. ప్రీమియం దాదాపు రెట్టింపైంది. కిస్తీ ఏడాదికి రూ.1,144 కోట్లు కట్టాల్సి వస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకుందని సీఎం తెలిపారు. వ్యవసాయ అధికారులే రైతుబీమా పథకం అమలును పర్యవేక్షించాల్సి ఉంది.

అధికారులకు ఆదేశం

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. సకాలంలో నాణ్యమైన, కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందేట్లు చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. కల్తీలు, నకిలీలను గుర్తించి అరికట్టాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మరిన్ని పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. కొత్త వంగడాలను సృష్టించాలన్నారు. వ్యవసాయదారులకు ఆధునిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలన్నారు. వ్యవసాయ విస్తరణ పనులు చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో సాగునీటి వసతి పెరిగినందున వ్యవసాయం కూడా బాగా పెరిగిందన్నారు.

నియంత్రిత సాగు అవసరం లేదు

రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతుంది. ఈ రైతువేదికల్లో రైతులు, వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశం కావాలి. తమ స్థానిక పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేయాలనే విషయంలో అక్కడే నిర్ణయాలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ రైతు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదని. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలన్నారు. పంటను ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే అమ్ముకోవాలని తెలిపారు. ఈ విధానం ఉత్తమం అని సమావేశంలో విస్తృత అభిప్రాయం వ్యక్తమైంది.

ఇదీ చూడండి :

హైదరాబాద్ అపోలో ఆస్పత్రి నుంచి​ రజినీకాంత్ డిశ్చార్జ్

Last Updated : Dec 27, 2020, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details