CM KCR Comments: అందరూ కోరుకుంటే.. దేశం కోసం కొత్త పార్టీ పెడతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు. దేశం కోసం ముందుకు కదలాల్సింది దేశ ప్రజలేనని పునరుద్ఘాటించారు. జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరన్నారు. ప్రజలు కలిసి వస్తే.. నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కోసం రాహుల్‌ను వెనకేసుకొస్తున్నారని వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తెరాసకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎవరు ఎవరితో కలుస్తారన్నది కాలం చెబుతుందన్నారు. భాజపా అరాచక పాలనపై దేశమంతా చర్చ జరగాలని పిలుపునిచ్చారు.
అన్ని రాజకీయ శక్తులు ఏకమవ్వాలి..
"దేశంలోని అన్ని రాజకీయ శక్తులు ఏకమై భాజపాను వెళ్లగొట్టాలి. భవిష్యత్ రాజకీయాలను ఊహించి చెప్పలేం. భాజపా అరాచక పాలనపై దేశమంతా చర్చ జరగాలి. ఈ దేశం కోసం ముందుకు కదలాల్సింది దేశ ప్రజలే. కుల, మతాలు పక్కన పెట్టి జనమంతా పిడికిలి బిగించాలి. అప్పుడే దేశ ప్రగతిని సాధించగలం. జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరు. ప్రజలు కలిసివస్తే నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుంది. అందరి కోరిక అదే అయితే.. దేశం కోసం కొత్త పార్టీ అవసరమైతే పెడతా. కొత్త పార్టీ పెడితే తప్పేమీ లేదు. మన దేశ ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ ఉంది. ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. ఏదైనా సాధించవచ్చు. తెరాస స్థాపించినప్పుడు ఎన్నో మాటలన్నారు. ఆత్మవిశ్వాసంతో పోరాడి.. జనాల్లో చైతన్యాన్ని తెచ్చాం. కఠోర సమైక్యవాదినన్న చంద్రబాబు.. జై తెలంగాణ అనలేదా? సమైక్యవాద పార్టీ సీపీఐ జై తెలంగాణ అనలేదా? రాజకీయ ఫ్రంట్‌ను ఊహించొద్దు... ప్రజల ఫ్రంట్‌ను ఊహించండి. నేను ముంబయి వెళ్తా.. ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తా. ఏదేమైనా ఈవిషయంలో నేను కీలకపాత్ర పోషిస్తా. దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు." - సీఎం కేసీఆర్