ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేసీఆర్​ "క్లౌడ్​ బరస్ట్​" కథేంటీ..? ఇది ఆ దేశం పనేనా..? ఇందులో నిజమెంత..? - క్లౌడ్​ బరస్ట్

"క్లౌడ్ బరస్ట్" (Cloudburst)అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. కుండపోత వర్షాలకు ఏవో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. కేసీఆర్‌ చేసిన ప్రకటన సంచలనాత్మకమైంది. గతంలోనూ జమ్మూకశ్మీర్‌లోని లేహ్, లద్దాఖ్‌.. ఉత్తరాఖండ్‌లో ఇలా చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతంపై కూడా అలా చేస్తున్నట్లు ఓ సమాచారం వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. కుండపోత వర్షాలను ఇప్పటివరకు.. ప్రకృతి ప్రకోపంగానే భావిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులెవరూ ఇప్పటి వరకు "క్లౌడ్ బరస్ట్" (Cloudburst) కుట్ర అన్న వ్యాఖ్యలు చేయలేదు. ఇంతకూ.. కేసీఆర్‌ చెప్పిన "క్లౌడ్ బరస్ట్" (Cloudburst) కుట్ర ఇప్పటి వరకు ఎక్కడైనా జరిగిందా...? ఇది సాధ్యమా....?

1
1

By

Published : Jul 17, 2022, 6:46 PM IST

ఓవైపు దేశాన్ని అల్లాడిస్తున్న భారీ వర్షాలు.. మరోవైపు వాటివల్ల వస్తున్న వరదలతో ప్రజలు ఆగమవుతున్నారు. ఇదంతా ప్రకృతి ప్రకోపానికి జరుగుతున్న పరిణామాలని.. ఇన్ని రోజులు భావిస్తున్నాం. అయితే.. ఈ భారీ వర్షాలకు తెలంగాణ సీఎం కేసీఆర్​ చెప్పిన కారణంతో ఒక్కసారిగా అందరు అవాక్కయ్యారు. క్లౌడ్ బరస్ట్ (Cloudburst) అనే పద్ధతి వల్లే ఇంత విపత్తు జరుగుతుందని.. దానికి విదేశాలే కారణమని చెప్పటం అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది. ఈ వ్యాఖ్యల్లో నిజమెంతుంతో తెలియదు కానీ.. ఇంతకీ ఆ క్లౌడ్​ బరస్ట్​ అంటే ఏంటీ..? దాని వెనకున్న అసలు కథేంటో తెలుసుకునేందుకు జనాలు ఉవ్విళ్లూరుతున్నారు.

వాస్తవానికి క్లౌడ్‌ బరస్ట్ అంటే వాతావరణ శాక నిర్వచనం ప్రకారం... ఒక నిర్దేశించిన ప్రాంతంలో (ఒకటి నుంచి 10కిలోమీటర్ల లోపు వ్యాసార్ధంలో ) గంటకు 10సెంటీ మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం నమోదైతే దాన్ని "క్లౌడ్ బరస్ట్" (Cloudburst)గా భావిస్తారు. కొన్ని సార్లు ఒకే ప్రాంతంలో ఎక్కువ సార్లు ఈ "క్లౌడ్ బరస్ట్" (Cloudburst) సంభవించే అవకాశం ఉంది. అంటే.. నిర్దేశిత ప్రాంతంలో కుండపోతగా ఎడతెరపి లేకుండా వర్షం కురవటం అన్నమాట. వాడుక బాషలో చెప్పాలంటే.. "మేఘానికి చిల్లు పడ్డట్టు" అంటుంటాం కదా.. అలా అన్నమాట.

క్లౌడ్ బరస్ట్ (Cloudburst) చేసిన దేశాలు ఇవే...!:అయితే.. 2008 సంవత్సరంలో చైనా ప్రభుత్వం మొదటగా ఈ క్లౌడ్ బరస్ట్ (Cloudburst) ప్రయోగం చేసింది. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ సమయంలో స్టేడియాల లోపాలను పరిశీలించేందుకు క్లౌడ్ బరస్ట్ (Cloudburst) పద్ధతిని అనుసరించింది. బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందురోజు క్లౌడ్ బరస్ట్ (Cloudburst) ద్వారా భారీ కృత్రిమ వర్షాలను సృష్టించి అన్ని స్టేడియాలలో నీటి లీకేజీని పరీక్షించింది.

చరిత్రలోకి వెళ్లి చూస్తే.. 1948లోనే ఈ క్లౌడ్ బరస్ట్ (Cloudburst) పద్ధతికి అంకురార్పణ జరిగినట్లు తెలుస్తోంది. కొందరు శాస్త్రవేత్తలు ఘనీభవన పద్ధతులపై పరిశోధనలు చేసి క్లౌడ్ బరస్ట్ (Cloudburst) ద్వారా ఒకే ప్రాంతంలో భారీ వర్షాలను సృష్టించవచ్చని తేల్చారు. సిల్వర్ అయోడైడ్ బుల్లెట్లు భారీ వర్షాలకు కారణమయ్యే నీటి కణాల ఘనీభవనానికి కారణమవుతాయని వారు కనుగొన్నారు. దీనికి క్లౌడ్ సీడింగ్​గా నామకరణం చేశారు. గతంలో యూఎస్​ మిలిటరీ రుతుపవనాలను ఆసరా చేసుకుని వియత్నాం యుద్ధంలో క్లౌడ్​ సీడింగ్‌ చేసిందన్న వాదనలూ ఉన్నాయి. తద్వారా వియాత్నాం దళాలు బురద, క్లిష్ష పరిస్థితుల్లో చిక్కుకునేలా చేయడంలో అమెరికా మిలటరీ సక్సెస్‌ అయ్యింది.

క్లౌడ్‌ బరస్ట్‌ అంటే "క్లౌడ్ సీడింగ్"...?:క్లౌడ్‌ బరస్ట్‌ అంటే.. కృత్రిమ వర్షాలేనన్న వాదన కూడా ఉంది. గతంలో చాలా దేశాల్లో నీటి కొరత, అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రజలను రక్షించడానికి కృత్రిమ వర్షాలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. గతేడాది జులైలో వర్షాలు లేక దుబాయి అల్లాడింది. ఎండలు మండిపోతుండటంతో ఆ వేడిని తట్టుకునేందుకు అక్కడి ప్రభుత్వం కృత్రిమంగా వర్షాన్ని సృష్టించింది. అంతకంతకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి ఈ వినూత్న ప్రయోగం చేపట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి కూడా..!

ప్రపంచంలోని పలు దేశాలను వరుణుడు ఎన్నో ఏళ్లుగా కనికరించడంలేదు. ఇందులో దుబాయ్ ముందు వరుసలో ఉంటుంది. 50 డిగ్రీల ఉష్ణోగ్రతతో దుబాయివాసులు భానుడి భగభగలు తట్టుకోలేకయారు. ఎండలతో విసిగిపోయిన అక్కడి ప్రభుత్వం.. ఓ భారీ ప్రాజెక్టును చేపట్టింది. వరుణుడు కనికరించకపోయినా వర్షాన్ని నేలకు తీసుకొచ్చే పని చేసింది. "క్లౌడ్ సీడింగ్" అన్న పేరుతో వాడుకలో ఉన్న.. వర్షం తయారుచేసే టెక్నాలజీని ఉపయోగించింది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఈ క్లౌడ్ సీడింగ్.. డ్రోన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఆకాశం మేఘావృతమైనపుడు డ్రోన్లను మేఘాల మధ్యకు పంపించి వాటి ద్వారా విద్యుత్ షాక్ ఇస్తారు. ఇలా చేయడం ద్వారా అవి కలిసిపోయి వర్షం సృష్టించేందుకు ప్రేరేపిస్తాయి. ఇంగ్లాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్​కు చెందిన ప్రొఫెసర్ మార్టిన్ అంబామ్ ఈ టెక్నాలజీని ఉపయోగించే బృందానికి నేతృత్వం వహించారు. దుబాయ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 15 మిలియన్ డాలర్లును ఖర్చు చేసింది. ఈ భారీ వర్షపాతానికి ముందు పోలీసులు, వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వర్షం సమయంలో ఎవరూ బయటకు రావొద్దని, ముఖ్యంగా ప్రయాణాలు చేయకూడదని సూచించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details