ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు - పీఆర్సీ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్​ వరాల జల్లు కురిపించారు. 30 శాతం పీఆర్సీతో పాటు ఉద్యోగ పదవీ విరమణ పెంపును 61 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రకటన చేశారు. 2020 ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమలవుతుందని తెలిపారు. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వరాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

CM KCR Announced  PRC
CM KCR Announced PRC

By

Published : Mar 22, 2021, 1:27 PM IST

Updated : Mar 22, 2021, 2:30 PM IST

ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్​ వరాల జల్లు కురిపించారు. 30 శాతం పీఆర్సీతో పాటు ఉద్యోగ పదవీ విరమణ పెంపును 61 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రకటన చేశారు. 2020 ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమలవుతుందని తెలిపారు. కరోనా, ఇతర పరిస్థితుల వల్ల పీఆర్సీ కొంత ఆలస్యమైందన్నారు. 12 నెలల బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 9,17,097 మంది ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయని కేసీఆర్ వెల్లడించారు.

అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకొని

'తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎనలేనిది. ఉమ్మడి రాష్ట్రంలోనూ టీఎన్జీవో పేరుతో సంఘాన్ని కొనసాగించారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలిగే ప్రభుత్వంగా.. రాష్ట్రంలో తొలి పీఆర్సీని 43 శాతం అమలు చేశారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని 11వ పీఆర్సీ అమలుపై కమిషన్ నివేదిక ఇచ్చింది. సీఎస్​ అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన కమిటీ తన అభిప్రాయం వెలువరించింది. తాను కూడా ఉద్యోగసంఘాల నాయకులతో మాట్లాడి.. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకొని పీఆర్సీని ఖరారు చేశాం.'

-కేసీఆర్, తెలంగాణ సీఎం

కరోనా వల్ల ఆలస్యం

కరోనా విపత్తు ఆర్థిక వ్యవస్థను కుదిపేసిందని సీఎం అన్నారు. 11వ వేతన సవరణ కొంత ఆలస్యమైందని వివరించారు. మెరుగైన రీతిలో వేతన సవరణ ఉండేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఉద్యోగులకే కాకుండా.. ప్రభుత్వం యంత్రాంగంలో భాగస్వామ్యమైన వాళ్లందరికీ వర్తించేలా పీఆర్సీ ప్రకటించామని తెలిపారు. 12 నెలల బకాయి వేతనాలు పదవీ విరమణ సమయంలో పొందేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రిటైర్మెంట్‌ గ్రాట్యుటీ 12 నుంచి 16 లక్షలకు పెంపుతో పాటు.. విశ్రాంత ఉద్యోగులు పూర్తిస్థాయి పింఛను పొందే అర్హత వయసును 75 సంవత్సరాల నుంచి 70 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. విధినిర్వహణలో మరణించిన సీపీఎస్​ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పింఛన్‌ విధానం వర్తింపజేయాలని నిర్ణయించామన్నారు.

ఈహెచ్​ఎస్​ నూతన విధివిధానాలకు కమిటీ

80 శాతం ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ పూర్తైందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రక్రియ ముగిసిన తర్వాత.. ఖాళీల భర్తీని చేపడతామన్నారు. అర్హులైన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఆదేశించారు. స్కూల్‌ అసిస్టెంట్లకు సమానమైన పోస్టులు మంజూరు చేయడంతో పాటు భార్యాభర్తలు ఒకే చోటే పనిచేసేలా అంతర్‌జిల్లా బదిలీలు చేపట్టాలని ఆదేశించారు. కేజీబీవీ మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 180 రోజులకు పెంచామన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం- ఈహెచ్​ఎస్​ నూతన విధివిధానాల నిర్ణయానికి స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వరాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :కొవిడ్ విజృంభణ... ఆలయాల్లో అన్నప్రసాద వితరణ నిలిపివేత

Last Updated : Mar 22, 2021, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details