Prashanth Kishor: భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఏకమైతేనే ఆ పార్టీని గద్దె దింపగలమని ప్రశాంత్ కిశోర్ కేసీఆర్‌కు తెలిపారు. అయితే, తాము భాజపా, కాంగ్రెస్‌లతో సమదూరం పాటిస్తామని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. జాతీయస్థాయిలో ఈ రెండు పార్టీలు లేకుండా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు సాధ్యమేనని ఆయన అన్నట్లు సమాచారం.
ఆదివారం రెండో రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు సీఎం కేసీఆర్‌తో పీకే సమావేశమయ్యారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. భాజపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలనే లక్ష్యంతో ఆ పార్టీని ఎంచుకున్నానని పీకే పేర్కొన్నట్లు తెలిసింది. తాను కాంగ్రెస్‌లో చేరినా తమ సంస్థ ఐప్యాక్ తెరాసకు రాజకీయ సలహా సేవలు కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా తెరాస, ఇతర పార్టీల బలాబలాలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై నిర్వహించిన సర్వే ఫలితాలను వివరించినట్లు తెలుస్తోంది.
కేంద్రం వైఫల్యాలే.. తెరాసకు ఆయుధాలు:తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ రాష్ట్రంపై భాజపా అంతులేని వివక్ష చూపుతోందని, విభజన హామీలను నెరవేర్చడంలో వైఫల్యంతో పాటు ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యం చూపడం వంటివి తెరాసకు వచ్చే ఎన్నికల్లో పదునైన ప్రచారాస్త్రాలుగా ఉపయోగపడతాయని పీకే వివరించినట్లు తెలిసింది. కేంద్రం పక్షపాత ధోరణిపై రాష్ట్ర ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి దీన్ని ఇంటింటికీ తీసుకెళ్లగలిగితే భాజపాను ప్రజలు తిరస్కరించి, తెరాసకు పట్టం కడతారని వెల్లడించినట్లు తెలిసింది. దీనిపై కార్యాచరణను సైతం పీకే నిర్దేశించారు.
కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత:రాష్ట్రంలో తాము చేసిన సర్వే సారాంశాన్ని కేసీఆర్‌కు ప్రశాంత్ కిశోర్ వివరించారు. కొందరు ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత ఉందని, ఈ విషయం తెరాస అధిష్ఠానం దృష్టిలో ఉందని తెలిసినా వారు మారడం లేదని, మరోసారి సిట్టింగులందరికీ సీట్లు వస్తాయనే ధైర్యంతో ఉన్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. జనంలో వ్యతిరేకత ఉన్న వారిని మార్చే విషయం పరిశీలించాలని పీకే సూచించినట్లు సమాచారం.