ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంత కొరత ఉన్నప్పుడు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులా?: సీఎం జగన్‌ - CM Jagan comments on vaccination

ప్రధాని మోదీకి సీఎం జగన్ మరోలేఖ రాశారు. టీకాల కొరత అంటూనే ప్రైవేటుకు ఎలా ఇస్తారని జగన్ లేఖలో ప్రశ్నించారు. ఈ పరిస్థితిలో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీకాల వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సీఎం... కేంద్ర, రాష్ట్రాల మార్గదర్శకాల మేరకు టీకా కార్యక్రమం జరగాలని అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోదీకి సీఎం జగన్ మరోలేఖ
ప్రధాని మోదీకి సీఎం జగన్ మరోలేఖ

By

Published : May 22, 2021, 5:27 PM IST

Updated : May 23, 2021, 5:00 AM IST

‘దేశంలో ఉత్పత్తి అవుతున్న కొవిడ్‌ టీకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా టీకాలు వేసే వీలు కలుగుతుంది. ఉత్పత్తిదారుల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. దీనివల్ల వారు రూ.2 వేలనుంచి రూ.25వేలు కూడా డోసుకు వసూలు చేస్తున్నారు. ప్రజల నుంచి ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలి. సానుకూల నిర్ణయం తీసుకుని ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్‌ టీకా నల్లబజారుకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలి’ అని ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి జగన్‌ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రధానికి లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి...
* రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా కొవిడ్‌ టీకాలు వేయాలని నిర్ణయించాం. టీకాలు చాలినంత అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత 45 ఏళ్లు దాటినవారికి రెండు డోసుల టీకాల పంపిణీ ప్రక్రియ పూర్తిచేసే పనిలో ముందున్నాం. ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేయవచ్చన్న కేంద్ర నిర్ణయం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తోంది. టీకా ధరల్లో తేడాలు ఉండటంతో పాటు ఏ ధరకు వేయాలన్న విషయంలో వారికి వెసులుబాటు ఉండటంతో కొన్ని ఆసుపత్రులు డోసుకు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నాయి.
* నిజానికి కొవిడ్‌ టీకాలను ఉచితంగా అందించాలి. అలా కాకపోతే నామమాత్రపు ధరలో టీకా వేయాలి. ప్రస్తుత విధానం వల్ల ప్రజలపై భారం పడుతుంది. వారి నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి టీకా వేయడానికే కొరత ఉంది. దీంతో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి టీకా వేయడం కొన్ని నెలల పాటు సాధ్యమయ్యేలా లేదు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా టీకా కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడం సరికాదు. దీంతో వారు ఇష్టానుసారం ధరలు వసూలుచేసే అవకాశం ఉంది. ఇది పేద ప్రజలను టీకాలకు దూరం చేయడమే అవుతుంది. ఇది నల్లబజారుకు దారితీసే ప్రమాదం ఉంది.
* ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు టీకాలు వేసుకునే అవకాశం ప్రజలకు ఇవ్వడం మంచి ఆలోచనే. కానీ అవసరానికి మించి టీకాలు అందుబాటులో ఉన్నప్పుడే అది సబబవుతుంది. టీకా విరివిగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రజలు వారి ఇష్టానుసారం ఇష్టమైన ఆసుపత్రిలో టీకా వేయించుకుంటారు. ప్రస్తుతం డిమాండ్‌ కన్నా ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. ఈ సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడం వల్ల వారు ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తారు. దీనిపై పునరాలోచించాలి.

Last Updated : May 23, 2021, 5:00 AM IST

ABOUT THE AUTHOR

...view details