CM Jagan with resigned ministers: ‘వచ్చే ఎన్నికలు చాలా కీలకం. ఇప్పుడు మనం గెలిచిన 151 సీట్లనూ నిలబెట్టుకోవాలి లేదా అంతకంటే ఎక్కువగానే సాధించేలా ఉండాలి. ఆ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించగలిగితే తర్వాత మనకు పోటీయే ఉండదు. వచ్చే రెండేళ్లూ నా కోసం, పార్టీ కోసం పనిచేయాలి. పార్టీని బలోపేతం చేసి, తిరిగి అధికారంలోకి తీసుకువస్తే.. మళ్లీ మీరే కేబినెట్‌లోకి వస్తారు’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గురువారం మంత్రి పదవులకు రాజీనామా చేసిన నేతలకు కర్తవ్య బోధ చేశారు. కేబినెట్ సమావేశం అనంతరం ప్రత్యేకంగా వారితో మాట్లాడారు. ‘మీకు పార్టీ జిల్లా, ప్రాంతీయ బాధ్యతలను అప్పగిస్తాం. మంత్రులుగా మీరు పొందిన గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా ఏర్పాట్లు చేసే యోచన చేస్తున్నాం. జిల్లాకో అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను మీకు అప్పగించి, మీ అందరికీ కేబినెట్ హోదా కల్పించే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నాం’ అని సీఎం నేతలతో చెప్పినట్లు సమాచారం.
పనితీరే ప్రామాణికం..: ‘ఏప్రిల్ నెలంతా నియోజకవర్గాలో వాలంటీర్ల సత్కార కార్యక్రమాలను కొనసాగించాలి. తర్వాత గడపగడపకూ వైకాపా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలి. గ్రామ, వార్డు సచివాలయాలను మీలో ప్రతి ఒక్కరూ సందర్శించాలి. ఆ కార్యక్రమాలను ఎలా నిర్వర్తించారు? ఎన్నికలకు పార్టీని ఎలా సిద్ధం చేస్తున్నారు, వ్యక్తిగతంగా మీ రాజకీయ స్థితిగతులు ఎలా బలోపేతమవుతున్నాయనేదీ నేను సమీక్షిస్తుంటా. పనితీరే ప్రామాణికంగా తీసుకుంటాం’ అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది.
మీరేం తక్కువ కాదు..: ‘ఇప్పుడున్నవారిలో కొందరిని కొనసాగిస్తున్నామంటే మిగిలినవారిని తక్కువ చేసినట్లు కాదు. సామాజిక, రాజకీయ సమీకరణాల కారణంగానే ఇలా చేయాల్సి వస్తోంది. మీరంతా మంచి బృందం. పార్టీ ఎమ్మెల్యేలు అందరిలోనూ మీరంటే నాకు ప్రాధాన్యముంది. కాబట్టే మొదటి విడత కేబినెట్‌లోనే మిమ్మల్నందర్నీ తీసుకున్నా. మీరు కూడా ఇంతకాలం నాకు సహకరించారు. బాగానే పనిచేశారు. కానీ, వచ్చే రెండేళ్లలో పార్టీ బలోపేతమే మన ప్రాధాన్యం. అందుకే మీరు పార్టీ వ్యవహారాలను చూడాలి. ఇప్పటి వరకూ మంత్రులుగా పనిచేసిన మీరు రేపు జిల్లా అభివృద్ధి, సాగునీటి సలహామండలి వంటి సమావేశాలకు వెళ్లినప్పుడు వేదిక కింద భాగంలో సాధారణ సభ్యుల్లా కూర్చోవడం మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అందువల్ల మీ గౌరవానికి భంగం కలగకుండా చూసే ఆలోచన చేస్తున్నాం. డీడీబీలు లేదా ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను మీకు ఇవ్వడంతోపాటు మీ అందరికీ కేబినెట్ హోదా కల్పించే విషయమై ఆలోచిస్తున్నాం. దానివల్ల మీరూ అధికారిక సమావేశాల్లో మంత్రులతో సమానంగా వేదికలపై కూర్చునే వీలుంటుంది. దీనిపై త్వరలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేస్తాం’ అని చెప్పినట్లు సమాచారం.