ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Polavaram project అగమ్యగోచరం - పోలవరం ప్రాజెక్టుకు నిధులు

Polavaram project రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పోలవరంపై ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఘనమైన ప్రకటనలు చేసిన జగన్‌ ఇప్పుడేమో కేంద్రమే చేయాలంటూ బేల మాటలు మాట్లాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమంటూ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పదేపదే చెబుతుండటం. మరింత కలవరపెడుతోంది. చినుకు రాలినా వరద భయంతో నిర్వాసితులు బిక్కుబిక్కుమంటున్నారు.

Polavaram project
పోలవరం

By

Published : Aug 29, 2022, 7:21 AM IST

Updated : Aug 29, 2022, 10:40 AM IST

Polavaram project ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ ప్రాజెక్టును ఎప్పటికి పూర్తి చేస్తామో చెప్పలేమని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పదే పదే అంటున్నారు. ప్రతిపక్షనాయకుడి హోదాలో జగన్‌ ఇచ్చిన హామీలకు- ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన మాటలకు పొంతన లేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

నాడు:

చంద్రబాబు ప్రభుత్వానికి విలీన మండలాల నిర్వాసితులకు పరిహారం పెంచడం భారమవుతుందా? అధికారంలో ఎల్లకాలం చంద్రబాబే ఉండరు. మన ప్రభుత్వం వస్తుంది. పట్టిసీమలో ఎకరానికి రూ.20 లక్షలు ఇస్తున్నారు. పక్కనే ఉన్న పోలవరంలో ఇవ్వలేరా? మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.10 లక్షలు ఇచ్చి మీ కళ్లల్లో ఆనందం చూస్తా. వైఎస్‌ హయాంలో ఎకరానికి రూ.1.50 లక్షలే ఇచ్చారు. వారు రూ.5 లక్షలు అడుగుతున్నారు. అధికారంలోకి వస్తే నిర్వాసితులు అడుగుతున్నవన్నీ ఇచ్చేస్తాం. - 2016 జులై 13న కుక్కునూరు పర్యటనలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌

నేడు:

పోలవరం ప్రాజెక్టుపై మనం ఖర్చు పెట్టిన సొమ్ములే ఇంకా కేంద్రం రూ.2,900 కోట్లు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో కిందామీదా పడుతున్నాం. 41.15 మీటర్ల వరకు నీటిని నిలిపితే ఏయే గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయో వారికి సెప్టెంబరు నాటికి పునరావాస ప్యాకేజీ ఇచ్చేస్తా. 45.75 మీటర్ల వరకు నీళ్లు నిలబెట్టి నిర్వాసితులను తరలించాలంటే రూ.20 వేల కోట్లు కావాలి. రూ.వెయ్యి కోట్లో, రూ.రెండు వేల కోట్లో అయితే ఇచ్చేసేవాణ్ణి. అంత మొత్తం ఇవ్వడం నా ఒక్కడి చేతిలో ఉన్న పని కాదు. ఎలాగూ ఇవ్వాల్సిందే కాబట్టి ముందే ఇస్తే మంచిది కదా అని మోదీకి చెబుతా. - ఈ ఏడాది జులై 27న సీఎంగా చింతూరు మండలంలో నిర్వాసితులతో..

పోలవరం

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. ఈ ప్రాజెక్టును ఎప్పటికి పూర్తి చేస్తామో చెప్పలేమని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పదే పదే అంటున్నారు. ప్రతిపక్షనాయకుడి హోదాలో జగన్‌ ఇచ్చిన హామీలకు- ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన మాటలకు పొంతన లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడం నుంచి మొదలుపెడితే ఆ ప్రభుత్వంలో అంచనాల పెంపు, నిర్వాసితులకు సాయం అందించే విషయంలో ఆయన అప్పట్లో చెప్పిన మాటలకు ఇప్పటి చేతలు ఎంతో భిన్నంగా ఉన్నాయి.

పోలవరంపై ప్రతిపక్ష నేతగా జగన్‌ పదునైన విమర్శలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇంత ఆలస్యమా అని నిందించారు. అంచనాలు పెంచేశారంటూ ఆగ్రహించారు. నిర్వాసితుల ముఖాల్లో ఆనందం చూసేందుకు వారి డిమాండ్లు నెరవేర్చలేరా అని అధికారపక్షాన్ని ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడలేరా అని నిలదీశారు. అదే జగన్‌ మాట నేడు మారిపోయింది. ‘ఇదంతా నేను ఒక్కణ్ని చేసేది కాదు కదా- కేంద్రాన్ని అడుగుతా. ఒత్తిడి చేస్తా. వాళ్లు నిధులిస్తే మీకు అందిస్తా. లేకపోతే నేనేం చేయగలను’ అని బేల మాటలు మాట్లాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

పోలవరం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.56 వేల కోట్లకు అంచనాలు రూపొందించి కేంద్రానికి సమర్పిస్తే దాన్ని ఒక కుంభకోణంగా జగన్‌ అభివర్ణించారు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు తాను నిర్మిస్తానని తీసుకుని, భారీగా అంచనాలు పెంచేశారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ పోలవరం ప్రాజెక్టుకు రూ.55,548 కోట్ల అంచనాలు ఆమోదించి నిధులివ్వాలని ప్రధాని మోదీకి లేఖలు రాస్తున్నారు.

అధికారంలోకి రాగానే పోలవరం అవినీతిని తేల్చేస్తానంటూ ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ రేపో మాపో అవినీతిని తేల్చేస్తుందని సాక్షాత్తూ శాసనసభలో ప్రకటించారు. కమిటీ నివేదిక ఇచ్చినా ఇంతవరకూ ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. జగన్‌ అధికారంలోకి రాగానే పనులన్నీ ఆపేశారు. 2019 నవంబరులో రివర్స్‌ టెండర్ల పేరుతో గుత్తేదారును మార్చేసి, మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీకి పనులు అప్పగించారు. ఆ తర్వాతా పనులు వేగం పుంజుకోలేదు. ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయలేకపోయారు. దీంతో 2019, 2020 వరదల్లో డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట భారీ ఇసుక కోత ఏర్పడి ప్రాజెక్టు భవితవ్యానికి పెద్ద సవాల్‌ విసిరింది.

పునరావాసం విషయంలోనూ జగన్‌ ఆడిన మాట తప్పినట్లే అయింది. వైఎస్‌ హయాంలో భూములిచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని నాడు ప్రకటించారు. ఇప్పటికీ అతీగతీ లేదు. పునరావాస ప్యాకేజీ రూ.10 లక్షలకు పెంచుతామని ప్రతిపక్షనాయకుడిగా హామీ ఇచ్చారు. ప్రస్తుతం గరిష్ఠంగా ఎస్టీలకు రూ.6.86 లక్షలే ఇస్తున్నారు. గిరిజనేతరులకు రూ.6.36 లక్షలు మాత్రమే ఇస్తున్నారు.

పోలవరం

చేసేస్తాం అని.. చేతులేత్తేశారు
2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో పోలవరం ప్రాజెక్టును ఇదిగో పూర్తి చేసేస్తాం, అదిగో పూర్తి చేసేస్తాం అంటూ రకరకాల గడువులు చెప్పారు. 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని తొలుత ప్రకటించారు. ఆనక 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం పూర్తి చేసి నీళ్లిచ్చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ మాటలన్నీ మారిపోయాయి. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేయగలమో చెప్పలేమని సాక్షాత్తూ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చేతులెత్తేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేస్తామని రెండేళ్లుగా నమ్మకంగా చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందంటే సమస్యలు ఎవరి హయాంలో తలెత్తినట్లన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అంశాలవారీగా వైఫల్యాలివీ..
నిధులు: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే నిధులే కీలకం. ఇప్పటికీ రెండో డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకోలేకపోయింది. 2019 ఫిబ్రవరిలో రూ.55,548.87 కోట్లకు సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలు ఆమోదించింది. ఆ తర్వాత కేంద్రం దీన్ని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీకి అప్పజెప్పింది. ఆ కమిటీ రూ.47,725.74 కోట్లకు అంచనాలు ఆమోదించింది. ఇంతవరకు కేంద్ర మంత్రిమండలి పోలవరం తాజా అంచనాలకు ఆమోదం తెలియజేయలేదు. కొర్రీలపై కొర్రీలు వేస్తున్నా పరిష్కరించుకోలేకపోతున్నాం.

నాడు డీపీఆర్‌ ఆమోదించుకోలేకపోయారని విమర్శలు గుప్పించిన జగన్‌ ఇప్పుడు.. ‘పోలవరం నిధులు కేంద్రం ఇవ్వడం లేదు.. మనం కిందా మీద పడుతున్నాం. రూ.1,000 కోట్లో, రూ.2000 కోట్ల అయితే నేనే ఇచ్చేసేవాణ్ణి. రూ.వేల కోట్లు కేంద్రం ఇవ్వాలి. నేనేం చేయగలను’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. 25 ఎంపీ స్థానాలిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా, కేంద్రం నుంచి అన్నీ తెస్తా అని ఎన్నికల్లో ఓట్లడిగిన జగన్‌ ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లోనూ, అనేక కీలక బిల్లుల విషయంలో కేంద్రానికి బేషరతుగా ఎందుకు మద్దతు పలుకుతున్నారు? రాజ్యసభలో, లోక్‌సభలో ఎందుకు మద్దతిస్తున్నారు? పోలవరం డీపీఆర్‌-2 ఆమోదం పొందేలా కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు.. అనే విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన స్పందించడం లేదు.

పోలవరం

పునరావాసం:ఈ మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత గోదావరి వరద నీరు వెనక్కి ఎగదన్ని ముంపు గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. 2019 వరదల్లో నిర్వాసితుల కష్టాలు అందరూ చూశారు. 2020 వరదల్లోనూ వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 2021 వరదల సమయానికి కూడా కనీసం తొలిదశ పునరావాసం ఈ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయింది? 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడే నాటికి తొలిదశ పునరావాసం పూర్తి చేసేందుకు రూ.2,728 కోట్లు అవసరమని లెక్కించారు.

ఏదో రూ.వెయ్యి కోట్లో, రూ,2000 కోట్లో అయితే నేనే ఇచ్చేస్తా అని ప్రకటించిన జగన్‌ ఈ మూడేళ్లలో ఆ సొమ్ములు ఎందుకు ఇవ్వలేకపోయారు? తొలిదశలో 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 8,272 కుటుంబాలకే పూర్తయింది. పునరావాస కాలనీలు ఇంకా పూర్తి కాలేదు. పునరావాస ప్యాకేజీ అందలేదు. నిర్వాసితులు వరద ముంపు తట్టుకోలేక గోకవరం, జంగారెడ్డిగూడెం, చర్ల వంటి ప్రాంతాలకు వెళ్లి అద్దె ఇళ్లలో ఉంటున్నారు. నెలకు రూ.6,000 నుంచి రూ.8,000 వరకు అద్దెలు భరిస్తున్నారు. జగన్‌ చెప్పినట్లు మా ముఖాల్లో ఆనందం చూడటం అంటే ఇదేనా అని నిర్వాసితులు నిలదీస్తున్నారు.

సెప్టెంబర్‌ నాటికి తొలిదశ పునరావాసం పూర్తి చేసేస్తామని ముఖ్యమంత్రి ఘనంగా ప్రకటించారు. 2019లో ముఖ్యమంత్రయిన కొత్తలో శాసనసభలో మాట్లాడుతూ గోదావరికి జులైలో వరదలు వస్తాయని, 10 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని కూడా చెప్పారు. జులై నాటికి నిర్వాసితులను తరలించలేకపోతే.. జులై వరద ముంపులో వారు అష్టకష్టాలు పడితే అది ఎవరి వైఫల్యం? ఏటా వరదల ముందు ఆగస్టు నాటికి అందరినీ తరలించేస్తామని గత మూడేళ్లుగా ప్రణాళికలు రచిస్తున్నా ఇప్పటికీ నెరవేర్చకపోవడం వైఫల్యం కాదా?

ధరలు, అంచనా వ్యయం, డీపీఆర్‌పై..

నాడు:కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు వారితో లాలూచీపడి రాష్ట్రం నిర్మిస్తుందని చెప్పి తీసేసుకున్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, లంచాల కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే ఈ పెద్దమనిషి (చంద్రబాబు) ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.53 వేల కోట్లకు పెంచేశారు. పోలవరం డిజైన్లు పూర్తి కాలేదు. డీపీఆర్‌ ఆమోదం పొందలేదు. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంతో శ్రీకాకుళం వరకు గోదావరి నీళ్లు వస్తాయి. కానీ నాలుగైదేళ్లుగా చంద్రబాబు పోలవరం సినిమా చూపిస్తున్నారు.

- నాడు ప్రతిపక్షనేత హోదాలో ప్రజాసంకల్పయాత్రలో జగన్‌

నేడు:పోలవరం ప్రాజెక్టుకు మొత్తం రూ.55,548 కోట్లు కావాలి. భూసేకరణ, పునరావాసానికే ఇంకా రూ.26,585 కోట్లు అవసరం. ఇతర సివిల్‌ పనులన్నీ కలిపి రూ.7,174 కోట్లు, విద్యుత్కేంద్రం నిర్మాణానికి రూ.4,124 కోట్లు కావాలి. ఇంతవరకు రూ.17,665 కోట్లు ఖర్చు చేశాం. మరో రూ.37,883 కోట్లు ఖర్చు చేయాలి. రాష్ట్రం ఖర్చు చేసిన నిధులే ఇంకా కేంద్రం నుంచి రావాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు రూ.55,547 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ తక్షణమే ఆమోదించాలి- అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలోనూ, ప్రధాని మోదీకి రాసిన లేఖలోనూ..

ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం:పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మాణంలో ఈ మూడేళ్లలో చేసింది చాలా తక్కువని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. 2019 మే నెలలో పాత ప్రభుత్వం దిగిపోయేసరికి ప్రధాన డ్యాం నిర్మాణ పని 64.8 శాతం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది మే నెలాఖరు నాటికి పనులు 76.33 శాతం పూర్తయ్యాయి. అంటే ఈ మూడేళ్లలో పూర్తి చేసిన పని కేవలం 12 శాతమే. జగన్‌ ప్రతిపక్షనేతగా ఎడమ కాలువ నిర్మాణంపైనా అనేక విమర్శలు గుప్పించారు. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు ఇవ్వచ్చన్నారు. 2019లో తెదేపా ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేనాటికి ఎడమ కాలువ పనులు 71.64 శాతం జరిగితే ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క అడుగూ పడలేదు. కుడి కాలువలో మిగిలిన పనులూ పెండింగులోనే ఉన్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Aug 29, 2022, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details