Prime Minister Fasal Bima Yojana: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకంలోకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సూచనల మేరకు మార్గదర్శకాల్లో పలు మార్పులు, చేర్పులు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌తోమర్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
యూనివర్సల్ కవరేజీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ: రాష్ట్రంలో పంటల బీమా పథకంలోకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకురానున్నారు. రైతులకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చేలా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఫసల్ బీమా యోజనలో మార్గదర్శకాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మార్పులు చేసింది. ఇటీవల కేంద్ర బృందం రాష్ట్ర పర్యటించగా.. సీఎం సూచనలతో ఫసల్ బీమా యోజన మార్గదర్శకాల్లో మార్పులు చేశారు. ప్రకటించిన పంటల్లో రైతులందరికీ ఫసల్ బీమా వర్తించేలా మార్పులు చేశారు. ఇ–క్రాప్ వివరాలతో బీమా పథకానికి అనుసంధానించే విధానం తీసుకువస్తున్నారు. వ్యవసాయ పద్ధతులు ఆధారంగా డేటా ఎంట్రీ చేసే విషయంలో సౌలభ్యతను కేంద్ర వ్యవసాయశాఖ తీసుకొచ్చింది. యూనివర్సల్ కవరేజీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఫసల్ బీమా యోజన అందరికీ వర్తింపు చేయాలంటే విధానపరంగా మార్పు రావాల్సి ఉందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
రైతుల భీమాను సైతం ప్రభుత్వమే చెల్లిస్తుంది: రైతులు సాగుచేసిన ప్రతి పంటను జియో ట్యాగింగ్‌తో ఇ–క్రాప్ చేస్తూ, రియల్ టైం డేటా చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రైతు సాగుచేస్తున్న ప్రతి పంటకూడా బీమా పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఉన్న అడ్డంకులను తొలగించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిందే కాదు, రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. అందరికీ పంట బీమా పరిహారం అందాలనే లక్ష్యంతో ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. సన్న, చిన్నకారు రైతులు తరఫున చెల్లించాల్సిన ప్రీమియంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటి భరిస్తే, మరిన్ని అద్భుతాలు జరుగుతాయన్నారు.