ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాకు మహానగరాలు లేవు.. మెరుగైనవైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం

కొవిడ్‌ నివారణ చర్యలపై రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానితో వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. రాష్ట్రంలో 25 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని తెలిపారు. ప్రతి 10 లక్షలమందిలో 47,459 మందికి పరీక్షలు చేశామన్నారు. క్లస్టర్లలోనే 85 నుంచి 90 శాతం వరకూ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా రాష్ట్రంలో మహా నగరాలు లేవని..వైద్యసదుపాయాల మెరుగునకు కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని ప్రధానిని..సీఎం జగన్ కోరారు.

CM jagan Video conference with PM
CM jagan Video conference with PM

By

Published : Aug 11, 2020, 12:35 PM IST

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధ్యమైనంత త్వరగా పాజిటివ్‌ కేసులను గుర్తిస్తున్నామని సీఎం జగన్.. ప్రధాని మోదీకి వివరించారు. పాజిటివ్‌ కేసుల గుర్తింపుతో మరణాలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుందన్నారు. వైద్య సదుపాయం అందించడమే కాకుండా, ఐసోలేషన్‌ చేస్తున్నామని తెలిపారు. కొవిడ్‌ వచ్చేనాటికి రాష్ట్రంలో వైరాలజీ ల్యాబ్‌ కూడా లేదన్న సీఎం.. ఇప్పుడు ప్రతి 10 లక్షలమందికి 47 వేలకుపైగా పరీక్షలు చేస్తున్నామని వివరించారు. అన్ని జిల్లాల్లో ల్యాబ్‌లు ఉన్నాయన్నారు. టెస్టుల విషయంలో స్వావలంబన సాధించామన్న జగన్.. క్షేత్రస్థాయిలో 2 లక్షలమంది వాలంటీర్లు కొవిడ్‌ నివారణా చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అవసరమైన అందరికీ పరీక్షలు చేస్తున్నామని.. ప్రతిరోజూ 9 వేల నుంచి 10 వేల కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. 138 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కొవిడ్‌ ఆస్పత్రులుగా వినియోగిస్తున్నామన్నారు. దాదాపు 109 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, 56 వేలకుపైగా బెడ్లు ఉన్నాయని సీఎం వివరించారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు 3286 మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం 11 వేలకుపైగా ఆక్సిబెడ్లు ఉన్నాయని అన్నారు.

గత 3 నెలల్లో దాదాపు 7 వేలకుపైగా బెడ్లు సమకూర్చుకున్నామన్న ముఖ్యమంత్రి.. రోగులను త్వరగా చేర్చుకునేందుకు హెల్ప్‌డెస్క్‌లు దోహదపడుతున్నాయని తెలిపారు. ప్రతి మండలంలో 108 అంబులెన్స్‌ ఉన్నాయని, పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా రాష్ట్రంలో మహా నగరాలు లేవని మోదీకి వివరించారు. భారీ మౌలిక సదుపాయాలు ఉన్న ఆస్పత్రులు రాష్ట్రంలో లేవన్నారు. వైద్యసదుపాయాల మెరుగునకు కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని ప్రధానిమోదీని.. సీఎం జగన్ కోరారు.

ఇదీ చదవండి:మూడు రాజధానుల నిర్ణయం... వారికి శరాఘాతం!

ABOUT THE AUTHOR

...view details