బంధువులెవరూ రాకుంటే ప్రభుత్వమే అంత్యక్రియలు చేస్తుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కరోనా మృతులకు పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించిన సీఎం.. అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. వచ్చే 6 నెలలపాటు 17వేల మంది డాక్టర్లు, సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతి ఇచ్చామన్న సీఎం..వచ్చే వారం రోజుల్లో కొరత లేకుండా భర్తీ చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉంటే సగం సమస్యలు తగ్గుతాయన్నారు. క్వాలిటీ ఫుడ్, శానిటేషన్ బాగుంటే సమస్యలు తగ్గుతాయని సీఎం స్పష్టం చేశారు.
'కొవిడ్ ఆస్పత్రుల్లో అత్యవసర పరికరాలు ఉన్నాయా? లేవా? చూసుకోవాలి. ఆక్సిజన్, బెడ్స్‌ను పెంచాలని నిర్ణయించాం. వచ్చే 15రోజుల్లో అవి అందుబాటులోకి రావాలి. రాష్ట్రస్థాయిలో ఉన్న 10 క్రిటికల్ కేర్ ఆస్పత్రులు, అలాగే జీజీహెచ్ ఆస్పత్రుల్లో రెమిడెసివర్ లాంటి ఖరీదైన మందులను అందుబాటులో ఉంచండి. పేషెంట్‌కు కనీసం రూ.30-35వేలు ఖర్చువుతుంది' అని జగన్ అన్నారు.
కొవిడ్‌పై ప్రచారం చేయాలి
కొవిడ్ రాకుండా జాగ్రత్తలు, చికిత్సపై భారీగా ప్రచారం చేయాలని సీఎం జగన్ అన్నారు. కొవిడ్ పరీక్షలు, ఇతర వివరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని.. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు ప్రదర్శించాలన్నారు. కాల్ సెంటర్ల పనితీరును అధికారులు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. పరిస్థితి చూసి హోం క్వారంటైన్, జిల్లా, రాష్ట్రస్థాయి కొవిడ్ కేంద్రాలకు పంపిస్తామన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న కరోనా బాధితులను వైద్యులు పర్యవేక్షించాలని కోరారు. విజిట్ చేసి మందులు అందుతున్నాయా? లేదా? చూడాలన్నారు.