ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డిసెంబర్ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలి: సీఎం

CM JAGAN VIDEO CONFERENCE : డిసెంబర్ నాటికి జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు కలిపి మొత్తం 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. డిసెంబర్‌ నాటికి 1.75 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, ఇళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్‌-3 కింద డిసెంబర్‌లో ఇళ్లు మంజూరు చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం నిర్వహించాక.. నెల రోజుల్లోనే ప్రాధాన్యతా పనులు మొదలు కావాలన్నారు.

By

Published : Sep 29, 2022, 8:41 PM IST

Published : Sep 29, 2022, 8:41 PM IST

CM JAGAN VIDEO CONFERENCE
CM JAGAN VIDEO CONFERENCE

CM VIDEO CONFERENCE WITH OFFICERS: స్పందనపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోన్న తీరు సహా సమస్యల పరిష్కారంపై సీఎం చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించామన్న సీఎం.. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎలాంటి ఆలస్యానికీ, అలసత్వానికీ తావు ఉండకూడదన్నారు. ఎమ్మెల్యే, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మండల స్థాయి సిబ్బంది అందరూ నెలలో కనీసం 6 సచివాలయాలను సందర్శించాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే.. గ్రామ, మండల స్థాయి సిబ్బందితో కలిసి కనీసం 2 రోజులు పాటు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో ఉండాలన్నారు. రోజులో కనీసం 6 గంటలపాటు గడప గడపకూ నిర్వహించాలని సూచించారు.

ఈ క్రాపింగ్​పై కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలి: గ్రామాల్లో మంజూరు చేసిన పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని, మంజూరైన తర్వాత నెలరోజుల్లోగా పనులు ప్రారంభం కావాలన్నారు. ఈ–క్రాప్‌ చాలా ముఖ్యమైందని.. ఎక్కడా పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఈ-క్రాపింగ్‌పై సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ సీజన్‌లో సాగు చేసిన 107.62 లక్షల ఎకరాల్లో 96 శాతం తొలి దశ పూర్తి చేశారని.. మిగిలిన 4శాతాన్ని రేపట్లోగా పూర్తి చేయాలన్నారు. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, వీఆర్వోలు–రైతుల కేవైసీలను అక్టోబరు 10లోగా పూర్తి చేయాలన్నారు.

అక్టోబరు 10 నుంచి రైతులకు ఈ–క్రాప్‌లో డిజిటల్‌, ఫిజికల్‌ రశీదులను 15లోగా ఇవ్వాలన్నారు. అక్టోబరు 15 నుంచి సోషల్‌ ఆడిట్‌ చేయాలని, 25 నుంచి వారం రోజుల పాటు ఈ–క్రాప్‌ చేసిన తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలన్నారు. నవంబరు 1 నుంచి ఈ తుది జాబితాను అన్ని పోర్టల్స్‌లోను అందుబాటులో ఉంచాలని సీఎం నిర్దేశించారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఈ–క్రాప్‌ పూర్తి చేసే బాధ్యత కలెక్టర్లదేనన్నారు. కనీసం 10శాతం ఈ–క్రాప్‌లను స్వయంగా ఎంఏఓ, ఎమ్మార్వోలు పరిశీలించాలని ఆదేశించారు. ఆర్డీఏలు, ఏవీఏలు 6 శాతం, డీఓలు 5శాతం , జేసీలు 2 శాతం, కలెక్టర్లు 1 శాతం స్వయంగా పరిశీలించాలన్నారు.

డిసెంబర్​ నాటికి 5 ఇళ్లు పూర్తి : గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌లను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 4500 గ్రామ సచివాలయాలకు డిసెంబర్‌లోగా కేబుల్‌ ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యం అందుతుందన్న సీఎం.. అక్కడ డిజిటల్‌ లైబ్రరీలను పూర్తిచేయడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణంపై సమీక్షించిన సీఎం.. నెల్లూరు, పశ్చిమగోదావరి, బాపట్ల, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో గృహనిర్మాణం బాగుందన్నారు. సత్యసాయి, ప్రకాశం, అనకాపల్లి, కృష్ణా, అనంతపురం జిల్లాలు వెనుకబడ్డాయని.. అక్కడ మరింత దృష్టి పెట్టాలన్నారు.

విశాఖపట్నంలో 1.24 లక్షల ఇళ్లు కేటాయించామని, అక్టోబరు నాటికి అన్ని ఇళ్ల పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఎంఏవై–వైయస్సార్‌ గ్రామీణ కింద మంజూరైన ఇళ్లు నిర్మాణ పనులు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్షన్‌ 3 కింద 3.27 లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నాయన్న సీఎం.. 10వేల ఇళ్లకు పైబడి ఉన్న లే అవుట్లలో స్టేజ్‌ కన్వర్షన్‌ వేగంగా జరగాలన్నారు. డిసెంబర్‌ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలన్నారు. ఇళ్లు పూర్తయ్యే నాటికి ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్‌... ఈ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు. మిగిలిపోయిన లబ్ధిదారులకు డిసెంబర్లో ఫేజ్‌–3 కింద ఇళ్ల మంజూరుకు సంబంధించి కలెక్టర్లు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. డిసెంబర్‌ నాటికి 1.75 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఇవ్వబోతున్నామన్నారు.

ఎస్‌డీజీల ఆధారంగా కలెక్టర్లకు మార్కులు : ఎస్‌డీజీ లక్ష్యాలపైన కలెక్టర్లు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు. డేటాను సక్రమంగా అప్‌లోడ్‌ చేయాలని, అప్పుడే ఎస్‌డీజీల్లో మార్పులు కనిపిస్తాయన్నారు. ఎస్‌డీజీల ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టర్ల పనితీరు, సమర్థత.. ఎస్‌డీజీ లక్ష్యాల సాధన ఆధారంగా నిర్ణయిస్తామన్నారు. దిశ యాప్‌ను ప్రతి ఇంట్లో కూడా డౌన్లోడ్‌ చేసుకునేలా చూడాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఎసీబీ నంబర్‌ 14400 పోస్టర్‌ అందరికీ కనిపించేలా 3x5 సైజులో ఉండాలని.. ఈ పోస్టర్‌ లేకపోతే, సంబంధిత కార్యాలయంలో ఉండే ముఖ్య అధికారిని దీనికి బాధ్యుడ్ని చేయాలని సీఎం ఆదేశించారు.

కాలేజీలో ఎస్‌ఈబీ నంబర్‌ 14500 ప్రదర్శించి మాదక ద్రవ్యాలకు సంబంధిన ఘటనలపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులకు సంబంధించిన భూ సేకరణపై కలెక్టర్లు దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. బెంగుళూరు – విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రంలో 345 కి.మీ మేర ఉందని, దాదాపు రూ.17 వేల కోట్లు ప్రాజెక్టు ఉందన్నారు. దీనికి అవసరమైన భూసేకరణపై దృష్టి పెట్టాలన్నారు. రైతు భరోసా రెండో విడత అక్టోబరు 26న, అదే రోజు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. వసతి దీవెన నవంబర్‌ 10 న విడుదల చేస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details