గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం జగన్ ముఖ్యమంత్రి జగన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరు భారత్‌పేటలోని వార్డు సచివాలయంలో.. టీకా తీసుకున్నారు. జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతి కూడా టీకా వేయించుకున్నారు. సీఎం వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 45 ఏళ్లు దాటినవారికి టీకాలు వేస్తున్నారు..
గ్రామాల్లో వ్యాక్సినేషన్‌పై వాలంటీర్లు అవగాహన కల్పిస్తారు. ఇంటింటికి వెళ్లి 45 ఏళ్లు దాటిన వారి వివరాలు సేకరిస్తారు. వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి అవగాహన కల్పిస్తారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా జరుగుతుంది. - సీఎం జగన్
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను యజ్ఞంలా చేపట్టాలని సీఎం జగన్ అన్నారు. 45 ఏళ్లు దాటినవారికి నేటి నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. 45 ఏళ్లు లోపు వారికి వేయాలని కేంద్రప్రభుత్వం చెబితే వేస్తామని స్పష్టం చేశారు. ఆరు వారాల్లోగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారని సీఎం అన్నారు. అవసరమైతే ఇంటింటికి వెళ్లి మూడు నెలల్లోపు ప్రక్రియ పూర్తిచేయాలని పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు ఆటంకం కారాదని సీఎం జగన్ అన్నారు. ఎస్ఈసీతో సీఎస్, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సమావేశమవ్వాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల యూనిట్ గా వ్యాక్సినేషన్ జరగాలన్నారు. వెంటనే ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. నిలిచిన పెండింగ్ ఎన్నికల ప్రక్రియను ఆరు రోజుల్లోగా ప్రారంభించాలన్నారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని