రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ప్రారంభించనున్నారు. స్వచ్ఛ సంకల్పం, క్లాప్ పథకాల అమలులో భాగంగా 4,097 చెత్త సేకరణ వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించనున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా సీఎం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే లక్ష్యంగా, గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తడి, పొడి చెత్తలతో పాటు ప్రమాదకరమైన వ్యర్ధాల సేకరణ కోసం ఇంటింటికి 3 డస్ట్‌బిన్‌ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల డస్ట్‌బిన్‌ల పంపిణీ చేయాలని నిర్ణయించారు. చెత్త సేకరణ కోసం 5,868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 231 గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ల నుండి తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరు వాహనాల ద్వారా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌ల వద్దకు చేర్చనున్నారు.
తడి చెత్త నుంచి కంపోస్టు ఎరువు, బయోగ్యాస్ తయారీతో పాటు పొడి చెత్త నుంచి హానికారక వ్యర్ధాలను వేరు చేసి పునర్వినియోగానికి అనుకూలంగా వస్తువులను మార్చాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు 10,731 హైప్రెజర్ టాయిలెట్ క్లీనర్‌ల కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. వీటన్నిటి ద్వారా స్వచ్చ సర్వేక్షణ్ లాంటి పోటీలలో ఏపీలోని గ్రామాలు పట్టణ ప్రాంతాలను మెరుగైన స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో 23,000 మంది గ్రీన్ అంబాసిడర్ ల ద్వారా చెత్త సేకరణ, రవాణా, శుద్దీకరణ, ఆదాయ ఉత్పత్తి, పరిసరాల పరిశుభ్రతతో పాటు కొత్తగా 4,171 చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అలాగే గ్రామ పంచాయతీలకు 14,000 ట్రైసైకిల్స్ పంపిణీ చేయనున్నారు. పదివేల పైచిలుకు జనాభా ఉన్న గ్రామాలు, పట్టణాలకు దగ్గరలో ఉన్న గ్రామాలలో చెత్త సేకరణ, రవాణా కోసం 1,000 ఆటో టిప్పర్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.