ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పంటలకు గిట్టుబాటు రాకుంటే .. ప్రభుత్వమే కొంటుంది'‌ - cm jagan review on agriculture

ఆర్బీకేల్లో విత్తనాలు, పురుగుమందులు సహా ఏం కొనుగోలు చేసినా.. రైతు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. గ్రామాల్లో రైతులు కోరిన 48 నుంచి 72 గంటల్లోగా.. వీటిని అందుబాటులోకి తేవాలన్నారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసి..సందేహాలు నివృత్తి చేయాలని సీఎం సూచించారు.

cm jagan starts rbk tc channel
cm jagan starts rbk tc channel

By

Published : Mar 18, 2021, 6:38 PM IST

Updated : Mar 19, 2021, 7:05 AM IST

ఆర్‌బీకే ఛానల్ ప్రారంభించిన సీఎం జగన్

రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల నాణ్యతపై ప్రభుత్వమే హామీ ఇస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ‘నాణ్యతలేని ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులు మోసపోకూడదనే ఆలోచనతోనే.. సంబంధిత ఉత్పత్తులను పరీక్షించి, నాణ్యతను ధ్రువీకరించేలా వాటిపై ప్రభుత్వ ముద్ర వేసి సరఫరా చేస్తున్నాం. ఆర్డరు పెట్టిన తర్వాత.. 48 గంటల నుంచి 72 గంటల్లో గ్రామాల్లోకి తెచ్చి రైతులకు అందిస్తున్నాం’ అని సీఎం వివరించారు. రబీ ధాన్యం సేకరణ, 2021-22 ఖరీఫ్‌ సన్నద్ధతపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ఆర్‌బీకే ఛానల్‌ను వర్చువల్‌ విధానం ద్వారా ఆయన ప్రారంభించారు. పంటలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణం తదితర అంశాలపై రైతు భరోసా కేంద్రాల్లోని స్మార్ట్‌ టీవీల ద్వారా సమాచారం ఇచ్చేందుకు ఆర్‌బీకే ఛానల్‌ దోహదపడుతుందని పేర్కొన్నారు.

‘'తక్కువ ధరకే పంట అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు.. మార్కెటింగ్‌శాఖ జోక్యం చేసుకుని సరైన ధర ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అలా చేయలేదంటే తానే నేరుగా కొనుగోలు చేస్తుంది. కనీస గిట్టుబాటు ధరల పోస్టర్‌ ఆర్‌బీకేల్లో ఉంది. అందులో ఉన్న ధర లభించకపోతే.. రైతులు తమ పేర్లను అక్కడున్న వ్యవసాయ సహాయకుడి వద్ద నమోదు చేసుకోవాలి. ఆయన ఈ విషయాన్ని సీఎం యాప్‌లో నమోదు చేస్తారు. మార్కెటింగ్‌శాఖ చర్యలు చేపడుతుంది. ఆర్‌బీకే యూనిట్‌గా ప్రతి గ్రామానికి పంటల ప్రణాళికను తయారు చేయాలి. చేపలు, రొయ్యల దాణా, పశు సంవర్థక మందులు రైతులకు అందుబాటులో ఉంచాలి. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్పందన నిర్వహించాలి’'. అని సీఎం నిర్దేశించారు.

6,081 రైతు భరోసా కేంద్రాల్లో పంటల కొనుగోలు

రాష్ట్రంలోని 6,081 రైతు భరోసా కేంద్రాల పరిధిలో పంట కొనుగోలు ప్రారంభమైందని అధికారులు సీఎంకు వివరించారు. ‘గత ప్రభుత్వ హయాంలో 2015-16 నుంచి 2018-19 వరకు పంటల కొనుగోళ్లకు రూ.43,047 కోట్లు వెచ్చించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.28,430 కోట్లతో పంట ఉత్పత్తుల కొనుగోలు జరిగింది’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌, సహకారశాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వయవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చాలి: నాబార్డు ఛైర్మన్‌

వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చాల్సిన అవసరం ఉందని నాబార్డు ఛైర్మన్‌ జీఆర్‌ చింతల పేర్కొన్నారు. ‘ఆహారశుద్ధి చాలా ముఖ్యమైన రంగం, తాగునీటి ప్రాజెక్టులకూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.. వీటికి నాబార్డు తరఫున సాయం అందించే విషయాన్ని ఆలోచిస్తాం’ అని చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు, నాబార్డు ఆర్థిక సాయంపై వివిధ శాఖల అధికారులు ఆయనకు వివరాలు అందించారు. నాబార్డు ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఉండటం గర్వకారణమని సీఎం జగన్‌ కొనియాడారు. అనంతరం ఛైర్మన్‌ను ఘనంగా సత్కరించారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల ముఖ్యమంత్రి. కీలక రంగాల్లో మార్పులు తీసుకురావాలనే తపనతో ఉన్నారు. వచ్చే 15 ఏళ్లలో రాష్ట్రం పూర్తిగా మారబోతోంది’ అని నాబార్డు ఛైర్మన్‌ పేర్కొన్నారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి: సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ.. హై కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్

Last Updated : Mar 19, 2021, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details