ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదువుతున్న 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను అందించే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు నెలకు 10 చొప్పున న్యాప్కిన్లు అందించనున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి పాఠశాలలకు వెళ్లి విద్యార్థినులకు వీటిని ఇవ్వనున్నారు.
సెలవులుంటే ముందుగానే..
ఒక్కో విద్యార్థినికి నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా అందిస్తామని సీఎం తెలిపారు. ఇందుకోసం రూ. 32 కోట్లు కేటాయించామన్నారు. విద్యా సంస్థలకు సెలవులుంటే ముందుగానే సరిపడా న్యాప్కిన్లు అందిస్తామని స్పష్టం చేశారు. దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్ని వైఎస్సార్ చేయూత దుకాణాల ద్వారా మార్కెట్ కంటే తక్కువ ధరకు నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ న్యాప్కిన్లను తీసుకునే అవకాశం కల్పించినట్లు సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు కోటి మంది మహిళల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. దేశంలో 23 శాతం మంది చిన్నారులు పాఠశాల విద్య మధ్యలో ఆగిపోతోందన్నారు. ఇలా చదువు ఆగిపోవడానికి ప్రధాన కారణం రుతుక్రమం సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులే కారణమని యునైటెడ్ నేషన్స్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికలో స్పష్టంగా వెల్లడించారన్నారు. రాష్ట్రంలో ఈ తరహా పరిస్ధితులు మారాలనే లక్ష్యంతో 'స్వేచ్ఛ' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు.
ప్రత్యేక నిధి ఏర్పాటు
చిన్నారులకు పరిశుభ్రత, ఆరోగ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం..ఈ దిశగా విద్యాసంస్థల్లో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 56 వేల 703 ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర విద్యా సంస్థల్లో నిరంతరం నీటి సరఫరాతో కూడిన మరుగుదొడ్లను బాలికల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాడు-నేడు మొదటి దశలో 15 వేల 715 పాఠశాలల్లో ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం పూర్తైందని..వచ్చే ఏడాది జూలై నాటికి అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. టాయిలెట్ల నిర్వహణకు పాఠశాలల్లో హెడ్ మాస్టర్లు, పేరెంట్స్ కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు సీఎం స్పష్టం చేశారు. పథకం అమలు కోసం ప్రతి పాఠశాల,కళాశాలలో నోడల్ అధికారిగా మహిళా అధ్యాపకురాలిని నియమిస్తున్నట్లు తెలిపారు.