CM Jagan On Health Department In AP:కొవిడ్ మేనేజ్మెంట్లో దేశానికి ఆదర్శంగా నిలబడేలా రాష్ట్ర హెల్త్ డిపార్టుమెంట్ పనిచేస్తోందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా.. సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పలు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన 144 ఆక్సిజన్ ప్లాంట్లను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు.
ఆక్సీజన్ కొరత వల్ల కొవిడ్ సెకండ్ వేవ్‌లో ఏర్పడిన పరిస్థితులు తలెత్తకుండా.. ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. రూ.426 కోట్ల వ్యయంతో పలు ఆస్పత్రుల్లో ఆక్సీజన్ ప్లాంట్లు, కీలక పరికరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 24,419 ఆక్సీజన్ పడకలతో సహా.. మొత్తం 39 లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ ట్యాంకులు సిద్ధం చేశామన్నారు. 32 పీఎస్ఏ ఆక్సీజన్ ప్లాంట్లను ఇప్పటికే జాతికి అంకితం చేశామన్న సీఎం... 144 ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 74 ఎల్ఎంవో ట్యాంకులు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచామన్నారు. 230 కిలో లీటర్ల సామర్థ్యం కల్గిన 23 ఎల్ ఎంవోలు అదనంగా కొనుగోలు చేశామన్నారు. 183 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 20 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్లను నెలకొల్పామని తెలిపారు.
గతంలో ఒక్క వైరల్ ల్యాబ్ కూడా లేని దుస్థితి రాష్ట్రంలో ఉండేదని.. టెస్టులు చేయాలంటే హైదరాబాద్, పూణెకు పంపాల్సి వచ్చేదని సీఎం జగన్ అన్నారు. దాన్ని అధిగమించేందుకు 20 ఆధునిక వైరల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. మరో 19 ల్యాబ్‌లు త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. కేరళ తర్వాత విజయవాడలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటైందన్నారు. రూ.20 కోట్ల వ్యయంతో ఆక్సీజన్ క్రయోజనిక్ ఐఎస్వో కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.