కర్బన ఉద్గార రహిత ఆర్థిక వ్యవస్థవైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి మద్దతు ఇవ్వకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందన్నారు. ‘కర్బన ఉద్గార రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తన’ అనే అంశంపై దావోస్‌లో మంగళవారం జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఇంధన, పారిశ్రామిక రంగాల పరివర్తన, భవిష్యత్తులో ఈ దిశగా అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాల్సిన అంశాలపై చర్చించారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఆర్సెలర్ మిత్తల్ గ్రూప్ సీఈవో ఆదిత్య మిత్తల్, గ్రీన్‌కో గ్రూప్ సీఈవో అనిల్ పాల్గొన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలవనుంది. ఇక్కడికి రావడానికి కొద్ది రోజుల కిందట కర్నూలులో 5,230 మెగావాట్ల సమీకృత పునరుత్పాదక విద్యుత్ నిల్వ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 33వేల మెగావాట్ల పీఎస్‌పీలు
‘మనం 15-16వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్‌పీ) గురించి మాట్లాడుతున్నాం. 33వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల పీఎస్‌పీలను ఏర్పాటు చేసే సామర్థ్యం ఏపీలో ఉంది. ఎవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చు. సంప్రదాయేతర పరిశ్రమలకూ మార్పు చెందవచ్చు. ఈ విద్యుత్‌ను వినియోగించుకుని హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తి చేయవచ్చు. ఎలక్ట్రాలసిస్ విధానంలో నీటి లవణీకరణ ప్రక్రియనూ నిర్వహించొచ్చు. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మైలురాయిగా నిలుస్తాయి. 5,230మెగావాట్ల సౌర, పవన, పీఎస్‌పీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ఒకే వేదికపై ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనం. ఇందులో 1,650 మెగావాట్లు పీఎస్‌పీ ప్రాజెక్టు. ఇది బ్యాటరీ విద్యుత్ మాదిరే ఎలాంటి హానికరం కాదు. ఈ రంగంలో ఆసక్తి ఉన్న ఎవరికైనా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. పెట్టుబడులతో రండి’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
కర్బన రహిత కేంద్రంగా ఏపీ
ప్రపంచంలోనే అతి పెద్ద సమీకృత విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు ఏపీలో ఏర్పాటు చేస్తున్నారు. ఒకే చోట సౌర, పవన, జల విద్యుత్ ప్లాంట్ల ద్వారా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇదే తరహాలో పీఎస్‌పీల ద్వారా 33వేల మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగితే.. భారత్‌లో ముఖ్యమైన కర్బన ఉద్గార రహిత కేంద్రంగా ఏపీ నిలుస్తుంది. యావత్ ప్రపంచానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తుంది. - అమితాబ్ కాంత్, సీఈవో నీతి ఆయోగ్
ఏపీలో పెట్టుబడులకు అనుకూల విధానాలు
గ్లోబల్ రెన్యూవబుల్ ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో సంస్థ భాగస్వామ్యంతో రూ.5వేల కోట్లు పెట్టుబడి పెట్టాం. భవిష్యత్తులో పెట్టుబడిని రెట్టింపు చేస్తాం. పునరుత్పాదక ప్రాజెక్టు కోసం ఏపీనే ఎంచుకున్నాం. అక్కడి ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు ఎంతో సానుకూలంగా ఉన్నాయి. కర్నూలులో ఒకే చోట మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి కానుంది. తక్కువ నీటి వినియోగంతో సాధించడం ఎంతగానో ఆకట్టుకుంది. ఇక్కడ రోజంతా 250మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ ప్రాజెక్టును నేను ప్రత్యక్షంగా సందర్శించాను.- ఆదిత్య మిత్తల్, ఆర్సెలర్ మిత్తల్ గ్రూప్ సీఈవో