కొవిడ్ 19 చికిత్స చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, డి-టైపు సిలెండర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దీనికోసం నిపుణులను నియమించటంతో పాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కొవిడ్ నియంత్రణా చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఆస్పత్రుల నిర్వహణలో కీలకమైన ఆక్సిజన్‌ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్, ఏసీ మరమ్మతులు ఇతర వైద్య పరికరాల అనుబంధ విభాగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని సూచన జారీ చేశారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం సూచించారు. వంద పడకలు కలిగిన ప్రైవేటు ఆస్పత్రులు మొదటి ప్రాధాన్యతగా ఆక్సిజన్ ఉత్పత్తిప్లాంట్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం 30 శాతం వరకూ సబ్సిడీ కూడా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్త వైద్య కళాశాలల కోసం భూ సేకరణను పూర్తిచేయాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.