ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan: నూతన విద్యా విధానం అమలుకు సిద్ధం కావాలి: ముఖ్యమంత్రి జగన్

cm jagan
cm jagan reviews on Nadu-Nedu

By

Published : Sep 7, 2021, 2:47 PM IST

Updated : Sep 7, 2021, 3:20 PM IST

14:45 September 07

cm jagan reviews on Nadu-Nedu

విద్యాశాఖలో నాడు-నేడు, ఫౌండేషన్‌ స్కూళ్లపై సీఎం జగన్ సమీక్షించారు. నూతన విద్యావిధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానం అమలు దిశగా అడుగులు ముందుకేయాలని సూచించారు. పాఠ్యపుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచాలన్నారు. కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌పైనా సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ముందుగా వేయి స్కూళ్లను అఫిలియేషన్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు. అన్నిరకాల స్కూళ్లు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఐసీఎస్‌ఈ అఫిలియేషన్‌ మీద కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టినందున వచ్చే ఏడాది పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికే విద్యాకానుక అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులు నాణ్యతగా ఉండాలని ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది నుంచి విద్యాకానుకలో భాగంగా స్పోర్ట్స్‌ షూ, స్పోర్ట్స్‌ డ్రస్‌తో పాటు మంచి డిజైన్, నాణ్యత ఉండేలా చూడాలన్నారు. స్వేచ్ఛ కార్యక్రమం కింద స్కూల్లో ఆడపిల్లలకు శానిటరీ నాప్‌కిన్స్‌ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. అక్టోబరు మధ్యంతరంలో కార్యక్రమం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

'స్కూళ్లన్నీ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఐసీఎస్‌ఈ అఫిలియేషన్‌పై కూడా దృష్టిపెట్టాలి.  వచ్చే ఏడాది స్కూల్‌కు వెళ్లేనాటికే విద్యాకానుక అందించాలి. విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులు నాణ్యతగా ఉండాలి'-  జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి

విద్యా దీవెన నిధుల జమపై చర్చ.. రివ్యూ పిటిషన్​ పై నిర్ణయం

జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో కాకుండా కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్షించారు. ఈ అంశంపై రివ్యూ పిటిషన్ వేయాలని సమావేశంలో సీఎం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, పారదర్శకత కోసమే సీఎం జగన్ ఆదేశాల మేరకు తల్లుల ఖాతాల్లో నగదును జమ చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ వల్ల కలిగే లబ్ధిని తెలియజేస్తూ జగనన్న విద్యా దీవెనను యథాతథంగా అమలు చేయాలని రివ్యూ పిటిషన్​లో కోర్టును కోరతామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఇంటర్ ఆన్​లైన్ అడ్మిషన్లు చేస్తున్నామని.. దీన్ని నిలుపుదల చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలు తమకు ఇంకా అందలేదన్నారు. ఆన్​లైన్ అడ్మిషన్ల విధానం అమలు వెనుక ఉద్దేశం, ప్రయోజనాలు వివరిస్తూ ఈ విధానాన్ని అమలుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును కోరతామని మంత్రి తెలిపారు. థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికల దృష్ట్యా పాఠశాలల్లో కొవిడ్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అధికారులతో పాటు పేరెంట్స్ కమిటీలకు శిక్షణ..

నాడు – నేడు కింద రెండో విడతలో 12,663 పాఠశాలలను ఆధునీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 4535.74 కోట్ల రూపాయల ఖర్చుకు ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. 18,498 అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మూడో విడతలో నాడు–నేడు కింద 24,900 స్కూళ్లు చేపడుతున్నట్లు వివరించారు. ఇందుకోసం రూ.7821 కోట్ల ఖర్చు అంచనా వేసినట్లు తెలిపారు. రెండో దఫా నాడు - నేడుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. నాడు - నేడు పనులకు సంబంధించి సచివాలయంలో ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. సుమారు 12వేల మందికి శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం పేరెంట్స్‌ కమిటీలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణలపై ప్రత్యేక శ్రద్ద చూపించాలని సీఎం జగన్ ఆదేశించారు.  

నాడు - నేడు కార్యక్రమం ద్వారా ఇంత డబ్బు ఖర్చుపెట్టిన తర్వాత కచ్చితంగా స్కూళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లేకపోతే మళ్లీ పూర్వపు స్థితికి వెళ్లిపోతాయన్నారు. స్కూళ్లలో ఎలాంటి మరమ్మతులు వచ్చినా, ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే చేయించడానికి ఫండ్‌ ఒకటి ప్రతి స్కూల్లో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలని, అప్పుడే స్కూళ్లు నిత్యనూతనంగా ఉంటాయన్నారు. ఈ ఏడాది విద్యాకానుక కింద నూటికి నూరుశాతం పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. 

ఇదీ చదవండి

Vinayaka Chavithi controversy: చవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు.. తగ్గేదేలేదంటున్న విపక్షాలు!

Last Updated : Sep 7, 2021, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details