వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేసి బాధితులకు వేగంగా పరిహారం అందించినా బురదజల్లుతున్నారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లితే రూ.34 కోట్లే ఇచ్చారంటూ విమర్శిస్తున్నారని.. ఆ పెద్దమనిషివి బురద రాజకీయాలని చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. వరద నష్టంలో 40% రహదారులు, 30% పంటలు, సుమారు 18% ప్రాజెక్టుల రూపేణా జరిగిందని వివరించారు. హుద్‌హుద్ తుపాను సమయంలో రూ.22 వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పి.. రూ.550 కోట్లు మాత్రమే సాయం అందించారని, అదీ కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందని విమర్శించారు. వరద బాధితులను శరవేగంగా ఆదుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదని, కనీసం నెల సమయం పట్టేదని చెప్పారు. ఇప్పుడు వారం రోజుల్లోనే సాయం అందిస్తున్నామన్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం సోమవారం వర్చువల్‌గా సమీక్షించారు(CM JAGAN REVIEW ON FLOODS). వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతి, నష్టపరిహారం, నిత్యావసరాల పంపిణీ, రహదారుల తాత్కాలిక పునరుద్ధరణ వంటి అంశాలను తెలుసుకున్నారు.
ఇళ్లు లేనివారికి తాత్కాలిక వసతి
‘వరద బాధిత ప్రాంతాల్లో ఇళ్లు లేని వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలి. నివాసాలు ఏర్పాటయ్యే వరకూ వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. చెరువులకు గండ్లు పడకుండా పర్యవేక్షించాలి. చెరువుల మధ్య అనుసంధానత, అవి నిండగానే అదనపు నీటిని నేరుగా కాల్వలకు పంపించే వ్యవస్థ ఉండేలా దృష్టిపెట్టాలి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో(destroyed annamayya dam in kadapa district) నీటిని నిల్వ చేయలేని పరిస్థితి తలెత్తింది. అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులకు గండ్లు పడ్డాయి. ఆ ప్రాంతాల్లో తాగునీటి కొరత రాకుండా.. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికి అదనపు సాయం రూ.2 వేలు అందాలి. పంట నష్టం లెక్కింపు పూర్తయిన వెంటనే సామాజిక తనిఖీ నిర్వహించాలి. క్షేత్రస్థాయి పర్యటనలో వచ్చే విజ్ఞప్తులపై అధికారులు ఉదారంగా స్పందించాలి. పూర్తిగా ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్తవి మంజూరు చేసి, వెంటనే పనులు పూర్తయ్యేలా చూడాలి’ అని సీఎం స్పష్టం చేశారు.