'పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న లేఅవుట్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అప్రోచ్‌రోడ్ల నిర్మాణం, లెవెలింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి. వాటికి కావాల్సిన రూ.700 కోట్ల నిధులను వారం రోజుల్లో విడుదల చేస్తాం' అని ముఖ్యమంత్రి జగన్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. ప్రతి నెలా కనీసం 75 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు. కోర్టు కేసుల వల్ల పంపిణీ చేయని ఇళ్ల పట్టాల విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులు సమీక్షించి ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తారని చెప్పారు. స్పందన కార్యక్రమం, ఉపాధి హామీ, గ్రామ, వార్డు సచివాలయాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పేదలకు ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణం వంటి వివిధ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి కొత్తగా 2,11,176 మంది లబ్ధిదారులను గుర్తించగా... 1,12,262 మందికి పట్టాల పంపిణీ జరిగిందని, మిగతా 98,914 మందికి అవసరమని భూమిని త్వరలోనే గుర్తించి పట్టాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. టిడ్కో ఇళ్లను ఈ నెలాఖరుకల్లా లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ అంశాలపై సీఎం పలు ఆదేశాలిచ్చారు.
జాప్యాన్ని సహించను:
* గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైస్సార్ విలేజ్ క్లినిక్‌లు, బీఎంసీలు, ఏఎంసీల భవనాల నిర్మాణంలో జాప్యాన్ని సహించేది లేదు. రుతుపవనాలు ముందుగా వస్తే వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
* భూముల రీ సర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. కలెక్టర్లు ప్రతి వారం సమీక్షిస్తేనే, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. రోజువారీ పనుల పురోగతిపైనా నివేదిక తెప్పించుకోవాలి.
స్పందన పోర్టల్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేయాలి
* గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమం చేపట్టాలి. జిల్లా, డివిజన్, మండలాల్లో ప్రతి సోమవారం స్పందన నిర్వహించాలి. ఆ సమయంలో సంబంధిత అధికారులు పాల్గొంటున్నారో లేదో సమీక్షిస్తాం. స్పందన పోర్టల్‌లో కొన్ని మార్పులు చేస్తున్నాం.
* అర్జీలపై క్షేత్ర స్థాయిలో జరిపే విచారణలు, తనిఖీలకు సంబంధించిన ఫొటోలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ సమయంలో ఫిర్యాదుదారుడు కచ్చితంగా ఉండాలి. క్షేత్ర స్థాయి విచారణకు సంబంధించిన ఫొటోలే కాకుండా, సమస్య పరిష్కారమైన తర్వాత ఫొటోలు కూడా అప్‌లోడ్ చేయాలి.
* నా కళ్లు, చెవులు మీరే. మీ పనితీరే నా పనితీరు. మనందరి పనితీరు.
* గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల వద్దకు వచ్చే సమస్యల్ని పరిష్కరించడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి.