ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగనన్న కాలనీల్లో జూన్‌ 1న పనులు ప్రారంభించండి: సీఎం జగన్ - సీఎం జగన్ సమీక్ష వార్తలు

జగనన్న కాలనీల్లో జూన్‌ 1న పనులు ప్రారంభించాలని.. కర్ఫ్యూ సమయంలోనూ నిర్మాణ పనులు ఆగకూడదని సీఎం జగన్ ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిధిగా కార్యకలాపాలు సాగించాలని సూచించారు. లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటామంటే వద్దని చెప్పవద్దని పేర్కొన్నారు.

YSR housing scheme
cm jagan

By

Published : May 5, 2021, 5:07 PM IST

Updated : May 6, 2021, 4:37 AM IST

'రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగొద్దు. కర్ఫ్యూ ఉన్నా మధ్యాహ్నం 12 గంటల వరకు పనులు కొనసాగాల్సిందే. లబ్ధిదారులెవరైనా సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటామంటే వద్దని చెప్పవద్దు' అని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టంచేశారు. 'వారికి కావాల్సిన మెటీరియల్‌ అందించండి. సిమెంట్‌, రహదారులు, భూగర్భ కాలువలు, నీటి సరఫరా, విద్యుత్తు, అంతర్జాలం వంటి సదుపాయాలు కల్పించాలి. అప్పుడే ప్రజలు వాటిల్లో నివసిస్తారు.' అని పేర్కొన్నారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జగనన్న కాలనీల్లో వసతులు కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపై అధికారులతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. 'ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి అదనంగా నిధులు కోరదాం. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఎలాగూ వాటా ఇస్తోంది. ఇంత పెద్దస్థాయిలో ఇళ్లు నిర్మిస్తున్నందున అదనపు నిధుల కోసం విజ్ఞప్తి చేద్దాం..' అని సూచించారు. వచ్చే ఏడాది జూన్‌కు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు నివేదించారు. ఈ మేరకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై వారు ప్రజంటేషన్‌ ఇచ్చారు.

'ఇళ్ల నిర్మాణాలతో కార్మికులకు పని దొరికి ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. స్టీల్‌, సిమెంట్‌ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయి. ఇళ్ల నిర్మాణంలో లెవలింగ్‌ అనేది చాలా ముఖ్యం. 1.95 లక్షల ప్లాట్లకు ఈ సమస్య ఉంది..'అని సీఎం జగన్‌ చెప్పారు. 'కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్‌ వినియోగం తగ్గి ధరల్లో తేడా వచ్చే అవకాశం ఉంది. 7.5 లక్షల టన్నుల స్టీల్‌ అవసరం. సంబంధిత సంస్థలతో మాట్లాడండి. వచ్చే నెల 1 నుంచి పనులు ప్రారంభించేలా, ఈనెల 25 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఉదయం 12 గంటల వరకు పనులు నిర్వహించాలి. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీరు, విద్యుత్తు సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి లేఅవుట్‌లో తప్పనిసరిగా ఒక మోడల్‌ హౌస్‌ నిర్మించాలి. ఎక్కడైనా నిర్మాణ వ్యయం అంచనాలకు మించి పోయిందా? ఇంకా ఎక్కడైనా వ్యయాన్ని నియంత్రించొచ్చా? ఇంకా బాగా ఇంటి నిర్మాణం ఎలా చేయొచ్చు? వంటి అంశాలపై నివేదికలు తెప్పించుకొని సమీక్షించుకోవాలి...' అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 'కాలనీల్లో భూగర్భ కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటుతో భవిష్యత్తులో తాగునీరు, విద్యుత్తు సరఫరా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తవు. కేబుళ్ల మధ్య దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పనులన్నీ ఒకే ఏజెన్సీకి ఇవ్వాలి. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలి.' అని సీఎం పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ: అమల్లోకి కఠిన ఆంక్షలు

Last Updated : May 6, 2021, 4:37 AM IST

ABOUT THE AUTHOR

...view details